రాష్ట్ర ప్రజల ఆహారపు అలవాట్లు వేగంగా మారుతున్నాయి. ఆరోగ్య పరిరక్షణ పై శ్రద్ధ పెరుగుతూ మధుమేహం, తదితర వ్యాధుల బారి నుంచి ఉపశమనం పొందేందుకు చిరుధాన్యాల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. రోజులో కనీసం ఒకసారైనా చిరుధాన్యాలు తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. మారుతున్న ఆహార అలవాట్లను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా చౌకధరల దుకాణాల ద్వారా రాగులు, తెల్లజొన్న సరఫరా చేస్తోంది. గడచిన మూడు నెలల్లో వీటికి డిమాండ్ పెరగటం ప్రజల ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పునకు అద్దం పడుతోంది. చౌకధరల దుకాణంలో బియ్యం బదులుగా రాగులు లేదా జొన్నలను కిలో రూపాయి చొప్పున తీసుకునే వీలు ప్రభుత్వం కల్పించింది.

ration 2412201 2

రాగులు, జొన్నల పంపిణీని తొలుత రెండేసి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టినప్పటికీ ప్రజల నుంచి పెరిగిన ఆదరణను గమనించి రాష్ట్రం అంతటా అమలు చేస్తున్నారు. రాగుల పంపిణీకి తొలుత 4000 టన్నులు సరఫరా చేసేందుకు ప్రతిపాదించగా, అక్టోబర్‌లో 2215 టన్నుల మేర ఇండెంట్ పెట్టారు. ఆ నెలలో కేవలం 810 టన్నులు మాత్రమే కార్డుదారులు తీసుకెళ్లారు. డిసెంబర్ నాటికి ఇండెంట్ 2262 టన్నులకు చేరుకోగా, 3475 టన్నులు పంపిణీ చేశారు. తెల్లజొన్న కూడా అక్టోబర్‌లో 2640 టన్నుల మేర ఇండెంట్ ఉండగా, 1531 టన్నులను పంపిణీ చేశారు. డిసెంబర్ నాటికి 1561 టన్నులను పంపిణీ చేశారు. దీంతో మూడునెలల్లో 5036 టన్నులను సరఫరా చేయడం విశేషం.

ration 2412201 3

రాగులకు సంబంధించి చిత్తూరు, అనంతపురం, కృష్ణా, కడపలో ఎక్కువ వినియోగం నమోదు కాగా, జొన్నలు కర్నూలులో ఎక్కువగా తీసుకెళ్లినట్లు వివరాలు తెలియచేస్తున్నాయి. జనవరి నుంచి మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉందని, ఈమేరకు ఎక్కువ మొత్తంలో రాగులు, జొన్నలను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరా సంస్థ జనరల్ మేనేజర్ వి వెంకటరమణ ఆదివారం ఇక్కడ తెలిపారు. రాగుల వినియోగం రాష్ట్రంలో అంతటా ఉందని, జొన్నలకు ఎక్కువ డిమాండ్ కర్నూలులో మాత్రమే ఉందన్నారు. వీటి సరఫరాపై పరిమితిని ఎత్తివేశామని, బియ్యం బదులు ఎంత కావాలన్నా తీసుకునే వెసులుబాటు కల్పించామని ఆయన వెల్లడించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read