నవ్యాంధ్ర చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించబోతున్న శుభ గడియలు సమీపించాయి. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం జాతీయ ప్రాజెక్టుకు మొదటి గేటును బిగించే పనికి శుభముహూర్తం ఖరారైంది. నవ్యాంధ్రుల జీవనాడిగా, వర ప్రదాయనిగా పేరుగాంచిన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అత్యంత కీలక ఘట్టానికి సోమవారం శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే 61.43 శాతం పనులు పూర్తి చేసుకుని శరవేగంగా నిర్మాణం జరుగుతున్న ఈ ప్రాజెక్టులో ముఖ్యమైన రేడియల్ గేట్ల ఏర్పాటు పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. 48 రేడియల్ గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా, అందులో తొలి గేటు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సోమవారం తొలి గేటును నిలబెట్టే కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులమీదుగా ప్రారంభించనున్నారు.
మిగిలిన 47గేట్లు వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో గేటు ఎత్తు 20.83 మీటర్లు, వెడల్పు 15.9 అడుగులు. మొత్తం గేట్ల తయారీకి 18వేల టన్నుల ఉక్కు అవసరమవుతుందని అంచనా. రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పనులు 61.98 శాతం పూర్తయ్యాయి. గేట్ల నిర్మాణానికి రూ. 530కోట్ల రూపాయలు వ్యయం అవుతోంది. గేట్లను నిలబెట్టేందుకు హైడ్రాలిక్ సిలిండర్లు వినియోగిస్తారు. ఒక్కో సిలిండర్ బరువు 250 టన్నులు కాగా, వీటిని జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నారు. గేట్ల ఏర్పాటులో హైడ్రాలిక్ సిలిండర్లతో పాటు సెల్ఫ్ లూబ్రికేటింగ్ బుష్‌లు కీలకంగా ఉంటాయి. వీటిని జపాన్ నుంచి దిగుమతి చేసుకున్నారు. మొత్తం 96 బుష్‌లు అవసరం అవుతాయి.
ఒక్కో హైడ్రాలిక్ సిలిండర్ 500 టన్నుల బరువును ఎత్తుతుంది. ఒక్కో గేటు 300 టన్నుల బరువు ఉంటుంది. గేట్‌ను ఎత్తి నిలబెట్టేందుకు వీలుగా ఇప్పటికే కొన్ని హైడ్రాలిక్ సిలిండర్లు ప్రాజెక్టు ప్రాంతానికి తరలించగా, మరికొన్ని కొద్దిరోజుల్లో రానున్నాయి. తొలిగేటును ఏర్పాటు చేయడం ద్వారా ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రాజెక్టను మే చివరి నాటికి పూర్తిచేసి గ్రావిటీ ద్వారా నీటిని అందించాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రాజెక్టు ఎత్తు 129 అడుగులు, పొడవు 9560 అడుగులు ఉంటుంది. 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సహా సాగు, మంచినీటి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మిస్తోంది.