‘మీ వస్తువులు జాగ్రత్త.. వాటి బాధ్యత మాది కాదు’ అనే రాతలు దాదాపు ప్రతి ఆర్టీసీ బస్సులోనూ కనిపిస్తుంటాయి. అయినా ప్రయాణీకులు కంగారులో ఏదో వస్తువులు మరిచి పోతుంటారు. ఆ తర్వాత వాటిపై ఆశలు వదిలేసుకొంటుంటారు. అయితే, తాజాగా తిరుపతిలో జరిగిన ఓ ఘటన ప్రయాణికుల సేవలో ప్రజా రవాణా సంస్థ నిబద్ధతతను తెలియజేస్తోంది. ఖరీదైన సెల్‌ఫోన్ పోగొట్టుకున్న ప్రయాణికుడికి కేవలం మూడు గంటల్లోనే ఆ సెల్‌ఫోన్‌ను అందించి శెభాష్ అనిపించుకుంది. తిరుమల స్వామి దర్శనానికి చెన్నై నుంచి గణేశ్ వచ్చారు. తిరుగు ప్రయాణంలో కొండపై శనివారం వేకువ జామున ఆర్టీసీ బస్సెక్కి తిరుపతిలో దిగిపోయారు.
అయితే, రూ.35 వేల విలువైన ఫోను కనిపించక పోవడంతో హుటాహుటిన తిరుపతి బస్టాండులో కంట్రోలర్‌కు ఫిర్యాదు చేశా రు. తాను దిగిన బస్ టికెట్ చూసిన కంట్రోలర్ ఆ బస్సు చిత్తూరుకు వెళుతున్నట్లు గుర్తించి ట్రాకింగ్ ద్వారా లొకేషన్ పసిగట్టారు. వెంటనే ఆ బస్సు కండక్టర్‌కు ఫోను చేసి విష యం చెప్పగా సీటు కింద ఫోను కనిపించింది. ఎదురుగా వస్తున్న చిత్తూరు-తిరుపతి బస్సు డ్రైవర్‌కు ఆ ఫోను ఇచ్చి పంపారు. టెక్నాలజీ ద్వారా తన ఫోను పసిగట్టడంతోపాటు కేవలం 3 గంటల వ్యవధిలో తనకు తిరిగి అందజేసిన ఆర్టీసీ సిబ్బందికి ఆ ప్రయాణికుడు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, అర్ధరాత్రి సమయంలోనూ అప్రమత్తంగా ఉండి, ప్రయాణికుడి ఫిర్యాదుపై స్పందించి ఖరీదైన వస్తువును నిజాయితీగా అందించిన సిబ్బందిని ఎండీ సురేంద్రబాబు అభినందించారు.
కొద్ది రోజుల క్రితం కూడా ఇలాంటి సంఘటన జరిగింది. తన సర్టిఫికెట్లతో ఉన్న బ్యాగును పోగొట్టుకుని తిరిగి బ్యాగును దక్కించుకున్న ఓ తమిళనాడు వాసి ఎపిఎస్ ఆర్టీసికి, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ సిఎం కార్యాలయానికి మెయిల్ చేశారు. ఆర్టీసీ బస్సులో చెన్నైకి ప్రయాణించిన తమిళనాడు వాసి తన ఒరిజినల్ సర్టిఫికెట్లు ఉన్న బ్యాగును బస్సులో మర్చిపోయాడు. తొలుత కోయంబేడు, పొన్నేరి బస్టాండ్లలో బ్రాంచ్ మేనేజర్ల ద్వారా, తమిళనాడు ఆర్టీసీ వెబ్ సైట్ ద్వారా ఆర్టీసికి సంబంధించిన కాంటాక్ట్ వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరికి ఎపిఎస్ఆర్టీసి హెల్ప్‌లైన్ నంబరుకు ఫోన్ చేశారు. దీంతో ఎపిఎస్ఆర్టీసి సిబ్బంది వెంటనే స్పందించిమ, బస్సు డ్రైవర్ నెంబరును, బస్సు ఉన్న ప్రాంతాన్ని ఆన్లైన్ ద్వారా ట్రేస్ చేసి సిబ్బంది ఇచ్చారు. దాంతో ఆ ప్రయాణికుడు తన బ్యాగును సురక్షితంగా తీసుకోగలిగాడు.