తెలుగుదేశం ప్రభుత్వంపై ఎదురుదాడిని మరింత ముమ్మరం చేసింది బీజేపీ. ఈసారి ముఖ్యమంత్రిపైకి మాజీ మంత్రి మాణిక్యాలరావు రాజీనామా అస్త్రాన్ని ఎక్కుపెట్టారు. తన నియోజకవర్గం తాడేపల్లిగూడేన్ని అభివృద్ధి చేయడం లేదని ఆరోపిస్తూ ఆయన తన రిజైన్ లేఖను సీఎంకు పంపించారు. 15 రోజుల్లో చంద్రబాబు దీనిపై స్పందించకపోతే 16వ రోజున నిరాహార దీక్షకు దిగుతానని అన్నారు. తాడేపల్లిగూడెంలో నిట్ శంకుస్థాపన సందర్భంగా ప్రభుత్వం తరపున 53 హామీలు ఇచ్చారని, వాటిని అమలు చేయడంలో వైఫల్యం చెందారని మాణిక్యాలరావు ఆరోపిస్తున్నారు. తాను MLAగా ఉన్నా.. స్థానిక టీడీపీ నేతలు పనులకు అడ్డుపడుతూ అభివృద్ధి జరక్కుండా కుట్ర చేస్తున్నారని మాణిక్యాలరావు అన్నారు.
మాజీ మంత్రి మాణిక్యాలరావు రాజీనామా లేఖకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. మంగళవారం అమరావతిలో మూడో శ్వేతపత్రం విడుదల చేశాక.. రాజీనామా వ్యవహారాన్ని మీడియా ప్రస్తావించగా స్పందించారు. మాణిక్యాలరావు పోలవరం ప్రాజెక్ట్ కోసం దీక్ష, పోరాటం చేస్తే బావుంటుందన్నారు చంద్రబాబు. ఆయన సొంత జిల్లాలోని పోలవరానికి కేంద్రం నిధులు ఇవ్వకపోతే మాణిక్యాలరావు ఒక్క మాట అడగలేదన్నారు. మాణిక్యాలరావు ధర్నాలు, దీక్షలు ఢిల్లీలో చేస్తే బావుంటుందన్నారు. తాడేపల్లి గూడెం నియోజకవర్గాన్ని మాత్రమే కాదని రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చెయ్యాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు సీఎం.
అభివృద్ధి చేయడం ప్రభుత్వ పని.. సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయన్నారు. మాణిక్యాలరావు ఒక్కసారి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా గమనించాలన్నారు. తాడేపల్లి గూడెంకు దగ్గరలోని నిట్‌కు నిధులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మోదీ దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీకి పశ్చిమగోదావరి జిల్లా కంచుకోటన్నారు చంద్రబాబు. ఆ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని.. ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయడం మంచిదికాదన్నారు. బెదిరంపులతో రాజకీయాలు చేయాలనుకోవడం సరైన పద్దతి కాదన్నారు ముఖ్యమంత్రి. రాజీనామాల పేరుతో తన దగ్గర చిల్లర రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదని మండిపడ్డారు.