ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది. గంటకు 13 కి.మీ వేగంతో ఇది తీరం దిశగా కదులుతోంది. ఇది మచిలీపట్నానికి 900 కి.మీ, శ్రీహరికోటకు 730 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయువ్య దిశగా ఇది కదులుతోంది. మరికొన్ని గంటల్లో తుపానుగా, మరో 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారే సూచనలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. 17వ తేదీన కాకినాడ-విశాఖ సమీపంలో తుపాను తీరం దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ తుపానుకు ‘పెథాయ్‌’గా నామకరణం చేశారు. ఈ పేరును థాయ్‌లాండ్‌ ప్రతిపాదించింది.

cyclone 13122018 2

పెథాయ్‌ తుపాను నేపథ్యంలో వాతావరణశాఖ అధికారులు కోస్తాంధ్ర జిల్లాలతో పాటు తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేశారు. 15న కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడులో కొన్నిచోట్ల భారీ వర్షాలు, 16, 17న కోస్తాలోని పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అలాగే 17వ తేదీ కోస్తాతో పాటు ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పారు. శనివారం నుంచే కోస్తా తీరంలో గాలుల తీవ్రత ఉంటుందని చెబుతున్నారు. 16వ తేదీ నుంచి గంటకి 80 కి.మీ నుంచి 110 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

cyclone 13122018 3

‘పెథాయ్‌’ తుపాను పరిస్థితులపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర యంత్రాంగం స‌ర్వస‌న్నద్ధంగా ఉందని అధికారులు ఆయనకు వివరించారు. జిల్లాల్లో తుపాను ముంద‌స్తు స‌న్నద్ధత‌ల‌పై సీఎం ఆర్టీజీఎస్ నుంచి వివ‌రాలు తెలుసుకున్నారు. ఎలాంటి ప‌రిస్థితి ఎదుర్కోవ‌డానికైనా సిద్ధంగా ఉండాల‌ని అధికారులను ఆదేశించారు. ప్రాణ‌న‌ష్టం లేకుండా చ‌ర్యలు తీసుకోవాల‌ని సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి అనిల్ చంద్రపునేఠా దీనిపై ప్రత్యేక దృష్టి సారించి యంత్రాంగంతో నిత్యం ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read