విశాఖను మెడికల్ హబ్‌గా అభివృద్ధి చేసే లక్ష్యంతో ఏర్పాటవుతున్న మెడ్‌టెక్ జోన్‌ను ఇవాళ చంద్రబాబు ప్రారంభించనున్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా వైద్య పరికరాల తయారీ పార్క్‌కు సాగర తీరం కేంద్రం కావడం విశేషం. పెదగంట్యాడ మండలం మదీనాబాగ్ ప్రాంతంలో 270 ఎకరాల్లో మెడ్‌టెక్ జోన్‌ను ఏర్పాటు చేశారు. మెడికల్ డిస్పోజబుల్స్, వైద్య రంగంలో వినియోగించే యంత్ర పరికరాలు, సర్జికల్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, మెడికల్ ఇంప్లాంట్స్, వ్యాధి నిర్ధారణతో పాటు ఆస్పత్రులలో వినియోగించే అన్ని రకాల పరికరాలు ఇక్కడ తయారు చేస్తారు. ఇలా అన్నీ ఒకేచోట ఉండటం ఈ పార్కు ప్రత్యేకత. దేశీయంగా దాదాపు 800 వైద్య ఉపకరణాల తయారీ యూనిట్లు పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఉన్నాయి. అయితే.. ఖరీదైన యంత్ర పరికరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను మాత్రం ఇప్పటికీ దిగుమతి చేసుకుంటున్నారు. దేశీయంగా వినియోగిస్తున్న పరికరాలలో 65శాతం ఇప్పటికి దిగుమతవుతున్నాయి. వీటికి పరిష్కారంగానే విశాఖ పార్క్ డెవలప్ చేస్తారు.
ఆసియాలో జపాన్, చైనా, సౌత్ కొరియాల తర్వాత వైద్య పరికరాలు తయారయ్యే అతిపెద్ద పార్క్ మెడ్‌టెక్ జోన్ మాత్రమే. ఏటా 17 శాతం వృద్ధితో 5 బిలియన్ డాలర్ల మార్కెట్ ఉన్న వైద్య పరికరాల తయారీ రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ జోన్ కు ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. నేషనల్ మెడికల్ డివైస్ పాలసీలో భాగంగా విశాఖలో రెండేళ్ల క్రితం 270 ఎకరాలు కేటాయించింది. 30 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించారు. ఈ మెడ్‌టెక్ జోన్‌లో యూనిట్ల ఏర్పాటు కోసం 25 సెంట్లు, 50 సెంట్లు, ఎకరా, రెండెకరాల విస్తీర్ణంలో ఫ్లాట్లను సిద్ధం చేశారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తయారీ యూనిట్లను నెలకొల్పేందుకు అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ తయారయ్యే పరికరాల నాణ్యతను నిర్ధారించేందుకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను పాటించనున్నారు. గామా ఇరాడినేషన్, బయో మెటిరియల్ టెస్టింగ్, 3డి ప్రింటింగ్, ప్రో టైపింగ్, ర్యాపిడ్ టూలింగ్, ఎక్స్ రే, సిటి స్కాన్ ట్యూబ్ మాన్యూఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా వ్యాధుల నిర్ధారణ భారం కూడా ప్రజలకు గణనీయంగా తగ్గనుంది. ప్రస్తుతం దేశీయ ల్యాబ్ టెస్టుల ధరలు 40శాతం తగ్గుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
మెడ్‌టెక్ జోన్ ఫేజ్1 లో 13 ఎకరాల విస్తీర్ణంలో కామన్ ఫెసిలిటిస్ అభివృద్ధి చేశారు. ఎకరం విస్తీర్ణంలో కన్వెన్షన్ సెంటర్, మరో ఎకరం విస్తీర్ణంలో మెడ్ ఎక్స్‌పో హాల్ నిర్మించారు. కామన్ సోషల్ అండ్ సపోర్ట్ ఫెసిలిటిస్ 11 ఎకరాలలో అభివృద్ధి చేశారు. రెండెకరాల విస్తీర్ణంలో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేశారు. టెస్టింగ్ సెంటర్లు, మార్కెటింగ్ కార్యాలయాలను కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రెగ్యులేటింగ్ అథారిటీ, కేంద్రం తరపున ఎక్స్‌పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ కలిసి తయారీదారుల కోసం మాన్యుఫ్యాక్చరర్ల అసోసియేషన్ ఏర్పాటు చేశారు. ఏదైన సంస్థ మెడ్‌టెక్‌లో కార్యకలాపాలు ప్రారంభించాలని అనుకుంటే ప్లగ్ అండే పే, రెడీ టూ మూవ్ వంటి సౌకర్యాలు కల్పిస్తారు. మెడ్ టెక్ జోన్ లో దాదాపు వందకుపైగా తయారీ సంస్థలు వస్తే దాదాపు 20 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తోంది ఏపీ ప్రభుత్వం.