ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల కేంద్రం తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీని దేశంలో భాగంగా కేంద్రం చూడటం లేదని మండిపడ్డారు. విశాఖ ఉత్సవ్‌లో ఎయిర్ షో నిర్వహించనివ్వకుండా అడ్డుకున్నారన్నారు. విశాఖ ఉత్సవ్‌లో ఎయిర్ షో ట్రైల్స్ తర్వాత రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు హైకోర్టు విభజన విషయంలోనూ సంప్రదింపులు జరపలేదన్నారు. సమయం ఇవ్వకుండా జనవరి1 కల్లా వెళ్లిపోవాలి అనడం సరికాదని అన్నారు. రాష్ట్రాల విషయంలో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విరుచుకుపడ్డారు. ఆరో శ్వేతపత్రం విడుదల సందర్భంగా మాట్లాడిన ఆయన.. జగన్ కేసులను దృష్టిలో పెట్టుకునే విభజన చేసినట్టుగా అనిపిస్తోందన్నారు. హైకోర్టు విభజనతో నాంపల్లి సీబీఐ కోర్టు విభజన కూడా జరుగుతుందని తెలిపారు.
ఉమ్మడి హైకోర్టు విభజనకు, వైఎస్ జగన్ పై నమోదయిన కేసులకు మధ్య లింక్ ఉందని చంద్రబాబు ఆరోపించారు. జగన్ కేసులో వాదనలు జరగకపోయినా న్యాయ ప్రక్రియ ముగిసిందని.. హైకోర్టు విభజనతో నాంపల్లి కోర్టు జడ్జి కూడా బదిలీ అవుతారన్నారు. కాబట్టి ఇప్పుడా ప్రక్రియ మళ్లీ ప్రారంభించాల్సిందేనన్నారు. ఇప్పటి వరకు జరిగిన విచారణ అంతా కొత్త జడ్జికి బదిలీ అయితే, మళ్ళీ మొదట నుంచి విచారణ మొదలవుతుందని అన్నారు. ఇదంతా జగన్ కు మేలు చెయ్యటం కోసమే అని చంద్రబాబు అన్నారు. జగన్ కేసులపై అనుమానాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోందన్నారు. ఉమ్మడి హైకోర్టు విభజనలో కేంద్రం ఎలాంటి సంప్రదింపులు జరపలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సంప్రదింపులు లేకుండానే హైకోర్టును విభజించారని ఆయన అన్నారు. సమయం ఇవ్వకుండా జనవరి 1కల్లా వెళ్లిపోవాలనడం సరికాదని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన తరహాలో హైకోర్టు విభజనకు సైతం మరికొంత సమయం ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కేంద్రం నిర్ణయం కారణంగా ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఒక రాష్ట్రం పట్ల కేంద్రం ఇలాంటి విధానం అనుసరిచండం సరైనది కాదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తామంటే కేంద్రం సహకరించ లేదని, ఇప్పుడు కేంద్రం రుణమాఫీ అంటే ఎన్నికల స్టంటే అని వ్యాఖ్యానించారు. ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలోనూ వ్యతిరేకిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. కడప స్టీల్ ప్లాంట్‌కు సహకరించని కేంద్రానికి పన్నులు ఎందుకు కట్టాలని ప్రశ్నించారు. కడప స్టీల్ ఫ్యాక్టరీపై సమాచారం ఇవ్వలేదని కేంద్రం అనడం సరికాదన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రానికి వైసీపీ ఊడిగం చేస్తోందని దుయ్యబట్టారు. కడప ఉక్కు ఫ్యాక్టరీపై వైసీపీ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. ప్రజలకు వైసీపీ సంజాయిషీ ఇవ్వాలని సీఎం చంద్రబాబు డిమాండ్ చేశారు.