ఉద్దానం గుండెకు గాయమైంది. మును పెన్నడూ లేని విధ్వంసంతో కకావికలమైంది. ఓ వైపు లక్షలాది ఎకరాల్లో పంటలు పోగా, మరోవైపు వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఎన్నో కుటుంబాలు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డాయి. ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ ఉద్దానం గుండెకు అండగా నిలవాలి. బాధితులను ఆదరించాలి. ప్రభుత్వమే కాకుండా ప్రతిపక్షాలు, స్వచ్ఛంద సంస్థలు తలో చేయి వేసి సాంత్వన చేకూర్చాలి. కానీ ఓ పార్టీ మాత్రం ఈ సందర్భాన్ని రాజకీయ అవకాశంగా మల్చుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ తను లాభపడేందుకు వాడుకుంటోంది. ప్రభుత్వం తరఫున అందుతున్న సాయాన్ని చూపించకుండా బాధితులకు అసలేం జరగడం లేదంటూ స్వయంగా కేడర్‌ను రంగంలోకి దించి నిర సనలను ప్రోత్సహిస్తోంది.
హైవే ముట్టడుల దగ్గర నుంచి రహదారులపై వాహనాలను అడ్డుకోవడం మొదలు.. బాధితులకు సాయం అందడం లేదనే సాకుతో పెట్రోలు పోసుకునే వరకు రాజకీయంగా వాడుకుంటోంది. చివరకు సీఎం చంద్రబాబు ముందే ప్రభుత్వ సాయం పై అబద్ధాలు ప్రచారం చేయడంతో సాక్షాత్తూ ఆయనే రంగంలోకి దిగి అదంతా ప్రతిపక్షం ఉద్దే శపూర్వక ప్రచారంగా తేల్చడం విశేషం. బుధవారం టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళిలో సాక్షాత్తూ సీఎం సమక్షంలోనూ సదరు పార్టీ అదృశ్యశక్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రచ్చ చేశారు. ఇక్కడ బాధితులతో సీఎం మాట్లాడుతూ ‘మీ అందరికి భోజనాలు అందుతున్నాయా’? అని ప్రశ్నించారు. అందులో కొందరు అందడం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. ఆగ్రహించిన సీఎం అధికారులను ప్రశ్నిస్తే భోజనం ఇస్తున్నట్లు చెప్పారు.
ఇస్తుంటే లేదంటున్నారేంటి అని తిరిగి అక్కడున్న బాధితులను ప్రశ్నించగా అందడం లేదనే సమాధానం వచ్చింది. దీంతో అధికారుల తప్పు ఉందేమో అని, వారిని మందలిస్తూనే, అనుమానం వచ్చిన సీఎం సమీపంలో పాఠశాలకు వెళ్లి పరిశీలిస్తే బాధితులు చెప్పింది అబద్ధం అని తేలింది. వెంటనే సీఎం ప్రసంగిస్తూ ఓ పార్టీ రాజకీయం చేసి బాధితులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించడం విశేషం. కాగా వరుసగా ప్రభుత్వం సాయం అందడం లేదనే ఆందోళన వెనుక సదరు పార్టీ హస్తం ఉన్నట్లు గుర్తించిన పోలీసుశాఖ అటువంటి నిరసనలు జరిగే ప్రాంతంలో ఇప్పుడు బందోబస్తును పెంచి ఎక్కడా పరిస్థితి చేయిదాటకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.