కేంద్రం సీబీఐపై విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చిందని, కేంద్రం వ్యవస్థలన్నింటినీ దుర్వినియోగం చేస్తోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. గురువారం కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ భయాలను సృష్టించేలా ఐటీ దాడులు చేయిస్తున్నారన్నారు. రోజు విడిచి రోజు ఐటీ దాడులు చేస్తున్నారని, దొంగ వ్యాపారం చేసేవారు ఏపీలో లేరని ఆయన అన్నారు. ఐటీ అధికారులకు స్వాగతం చెప్పి.. ఇక్కడ ఏం జరుగుతుందో వివరంగా చెబుతామని చంద్రబాబు స్పష్టం చేశారు.
రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రం సీబీఐని భ్రష్టుపట్టించిందని, నిబంధనల్ని కాలరాసి మోదీ అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. తప్పులు బయటపడతాయనే భయంతో సీబీఐ డైరెక్టర్‌ను మార్చారని సీఎం విమర్శించారు. చివరికి సీబీఐపై విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చారని ఆరోపించారు. కేంద్రం వ్యవస్థలన్నింటినీ దుర్వినియోగం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. సీబీఐలో జరుగుతున్న పరిణామాలు మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నిధులు ఇచ్చి మరీ వెనక్కు తీసుకుందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎన్నికలు ఉన్నందున ఆ రాష్ట్రానికి నిధులు ఇచ్చిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని... ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదన్నారు. పైగా ఇచ్చిన నిధులు వెనక్కి తీసుకున్నారని, పోలవరం నిధులు కూడా ఇవ్వలేదని చంద్రబాబు విమర్శించారు. స్మార్ట్ సిటీల వల్ల రాష్ట్రానికంటే కేంద్రానికే ఎక్కువ ఆదాయం వస్తుందని, కేంద్రం పట్టణాల అభివృద్ధికి నిధులు అరకొరగానే ఇస్తోందని చంద్రబాబు విమర్శించారు.