ఏపీ పై ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయో విశాఖ ఎయిర్‌పోర్టు ఘటనతో తేలిపోయిందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై దాడి, అనంతరం జరిగిన పరిణామాలపై చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్, కేటీఆర్, జీవీఎల్, కన్నా, పవన్, గవర్నర్ పై ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలో అంత పెద్ద తుఫాను వస్తే, ఒక్కరన్నా సానుభూతి చూపించారా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఆరు రోజుల తరువాత వచ్చి, నన్ను తిట్టారు, ఇక్కడ మాత్రం నిమషాల్లో అందరూ స్పందించారు అంటూ ధ్వజమెత్తారు. కొండగట్టులో ప్రమాదం జరిగి 62 మంది చనిపోతే, గవర్నర్ ఎన్ని నివేదికలు కోరారు ? ఇక్కడ మాత్రం, ప్రభుత్వాన్ని అడగకుండా, డైరెక్ట్ గా డీజేపీని అడుగుతారా ? మేము ఇంకా ఎందుకు అని ధ్వజమెత్తారు. నక్సల్స్ ఒక ఎమ్మల్యేను చంపితే, ఒక్కరన్నా స్పందించారా ? పవన్ కళ్యాణ్ ఈ దాడిని సమర్ధించలేదా అని అన్నారు.
‘‘తిత్లీతో తీవ్ర నష్టం జరిగినా కేసీఆర్, కేటీఆర్, కవిత ఒక్క మాటైనా మాట్లాడారా? ఇక్కడ మాత్రం దాడి జరిగిన వెంటనే స్పందించారు. దాడి జరిగిన కొద్ది సేపట్లోనే గవర్నర్ డీజీపీకి ఫోన్ చేయడం.. నివేదిక కోరామంటూ సమాచార మాథ్యమాల్లో రావడం... పవన్ కల్యాణ్, జీవీఎల్, కన్నా ఖండించడం.. ఏంటి ఇదంతా? సురేశ్ ప్రభు ప్రకటన.. సీఐఎస్‌ఎఫ్ కమాండో మాకేం సంబంధం లేదనడం.. అందరూ కలిసి డ్రామాలాడుతున్నారు. విమానాశ్రయంలో జరిగితే సీఐఎస్‌ఎఫ్ బాధ్యత లేదనడం ఏమిటి? తనిఖీ చేయాల్సిన బాధ్యత వారిది కాదా? గవర్నర్ పరిధి ఏంటని ప్రశ్నిస్తున్నా. ఆయన డీజీపీతో నేరుగా మాట్లాడటం ఏమిటి? ఎందుకడిగారు? ఏదైనా ఉంటే మా దగ్గర తీసుకోవాలి. నివేదిక ఇవ్వమని అడగాలి. దాన్ని పరిశీలించి తన ఇష్టమొచ్చిన దాన్ని కలిపి కేంద్రానికి పంపుకోవచ్చు. అది ఆయనకూ ఆనందం.. దిల్లీలో కూర్చున్న వాళ్లకూ ఆనందం. 14 ఏళ్లు సీఎంగా పనిచేశా.. ఇలా నేరుగా ఫోన్ చేసే విధానం ఎప్పుడూ చూడలేదు. దిల్లీ స్క్రిప్ట్ ఇక్కడ అమలు చేయాలంటే కుదరదు. గవర్నర్ వ్యవస్థపైనా చర్చ జరగాలి" అని చంద్రబాబు అన్నారు.
"నిన్ననే క్రికెట్ జరిగింది. ఒకవైపు ఫిన్‌టెక్ సదస్సు జరుగుతోంది. క్రీడాకారులు తిరిగి వెళ్లే సమయంలో ఇలాంటి నాటకాలాడతారా? 100 మంది వచ్చి జాతీయ రహదారిపై ధర్నా చేస్తారా? ఎంత అహంభావం? రాష్ట్రాన్ని తగలబెట్టాలనుకుంటున్నారా? పులివెందులలో మొదలు పెట్టారు. ఏమీ జరగని దానికి నాటకాలాడుతున్నారు. ఇకనైనా డ్రామాలు కట్టిపెట్టండి. రోడ్లమీదకు వచ్చి బస్సులు నిలపాలి, తగలబెట్టాలని చూస్తారా? కేంద్రాన్ని హెచ్చరిస్తున్నా.. మీ డ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లో సాగవు.. సాగనివ్వం.. మమ్మల్ని ఇబ్బంది పెడితే బూమ్‌రాంగ్ అవుతుంది. మీరు చేసే పనుల వల్ల రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అగ్రిగోల్డ్ కేసు ఇస్తాం తీసుకోండి అగ్రిగోల్డ్ కేసులిస్తాం.. ధైర్యముంటే తీసుకోండి.. అవినీతి గురించి మీరు మాట్లాడతారా? ఎవరెవరేం రాశారో తేలుతుంది.’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.