‘తిత్లీ’ తుఫాన్‌తో తల్లడిల్లిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి విపత్తుల సమయంలో ఇంత కనికరం లేకుండా వ్యవహరిస్తున్న ప్రధానిని గతంలో ఎన్నడూ చూడలేదని అన్నారు. తిత్లీ తుఫాన్ నష్టాన్ని అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందంతో శుక్రవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. తిత్లీ నష్టంపై ప్రధానితో ఫోన్లో మాట్లాడానని, నష్టం వివరాలు తెలియజేస్తూ ఆదుకోవాలని రెండుసార్లు లేఖ రాశానని, కేంద్రం నుంచి మాత్రం స్పందన రాలేదని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రం ఇంత ఆపదలో ఉంటే పెద్దన్నలా ఆదుకోవాల్సిన కేంద్రం బాధ్యత లేకుండా వ్యవహరించడం దుర్మార్గమని అన్నారు. పార్టీ కార్యాలయం ప్రారంభానికి రాష్ట్రానికి వచ్చిన కేంద్రం హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, తిత్లీ బాధితులను పరామర్శించడానికి మాత్రం సమయం కేటాయించలేదన్నారు.

cbn 26102018 2

హుద్‌హుద్ సమయంలో విశాఖ వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ రూ. వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి, తీరా రూ. 650 కోట్లు మాత్రమే ఇచ్చి సరిపెట్టారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. హుద్‌హుద్ సమయంలో తాను స్వయంగా ఇచ్చిన మాటను కూడా ప్రధాని నరేంద్ర మోదీ నిలబెట్టుకోలేకపోయారని, ఈసారైనా న్యాయం చేస్తారని ఆశిస్తున్నామని కేంద్ర బృందం సభ్యులతో ముఖ్యమంత్రి అన్నారు. గురువారం తిత్లీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, నష్ట ప్రభావాన్ని పరిశీలించామని కేంద్రం బృందం ముఖ్యమంత్రితో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తుఫాన్ రక్షణ, సహాయక చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని, తుఫాను అనంతరం ప్రజలు కష్టాలు పడకుండా, ఇంత వేగంగా కోలుకునేలా చేయడాన్ని ప్రశంసించారు. తుఫాను హెచ్చరికలు రావడంతోనే ప్రజలను అప్రమత్తం చేశామని, ప్రాణనష్టం భారీగా జరగకుండా టెలీ కాన్ఫరెన్సుల ద్వారా అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేశామని ముఖ్యమంత్రి వివరించారు.

cbn 26102018 3

కేంద్ర సాయం కోసం చూస్తూ కూర్చోలేదని, దసరా పండుగ కూడా జరుపుకోకుండా తామంతా కలిసి శ్రమించామని అన్నారు. తుఫాను కారణంగా లక్షలాది చెట్లు కూలిపోయాయని, వందల సంఖ్యలో మూగజీవాలు మరణించాయని, పెద్దసంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయని, రహదారి-విద్యుత్ వ్యవస్థకు తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు. మొత్తం రూ. 3,673.10 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా అత్యంత వెనుకబడిన ప్రాంతమని, తలసరి ఆదాయంలోనూ అట్టడుగున ఉందని, కిడ్నీ వ్యాధి బాధితులు ఎక్కువని, దీనికి తోడు ‘తిత్లీ’ తుఫాన్ మరింత కోలుకోకుండా చేసిందన్నారు. తుఫాన్ అనంతరం సహాయక చర్యలు చేపట్టి 12 రోజుల్లోనే సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేయగలిగామన్న ముఖ్యమంత్రి- గతంలో ఎన్నడూ లేనట్టుగా తుఫాను వచ్చిన 20 రోజుల్లోనే బాధితులకు పరిహారం అందించే ఏర్పాట్లు చేశామని చెప్పారు. ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కించామనే సంతృప్తి తమకు ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంత చేస్తున్నా కేంద్రం ‘తిత్లీ’ బాధితులను పూర్తిగా పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. మానవతా దృక్పదంతో కేంద్రం తక్షణం స్పందించి సమయానికి సాయం అందించాలని కేంద్ర బృందం సభ్యులను ముఖ్యమంత్రి కోరారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read