ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై ఢిల్లీ చేస్తున్న కుట్రల్ని, ఢిల్లీలోనే తేల్చుకోవటానికి ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన రేపు అందుబాటులో ఉన్న జాతీయ నేతలను ఆయన కలవనున్నట్టు సమాచారం. గవర్నర్ నరసింహన్ తీరును నిరసిస్తూ జాతీయ స్థాయిలో చంద్రబాబు గళమెత్తనున్నారు. ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి, ఆపరేషన్ గరుడ తదితర అంశాలను సీఎం దేశ ప్రజల ముందు ఉంచనున్నారు. శనివారం మధ్యాహ్నం 3గంటలకు కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మొండిచేయి చూపడం, తిత్లీ తుఫానుపై స్పందించకపోవడం, విభజన చట్టం పెండింగ్ అంశాలపై దిల్లీ వేదిక నుంచి ఆయన కేంద్రాన్ని నిలదీయనున్నారు.
మరోవైపు, గవర్నర్ వ్యవస్థను కేంద్రం వాడుకుంటోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలే టార్గెట్‌గా ఐటీ దాడులు, మరోవైపు జగన్‌పై దాడి ఘటనను గురించి చంద్రబాబు జాతీయ నేతలకు వివరించనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన పర్యటన పై ఆసక్తి నెలకొంది. ఏదేమైనా ఏపీలో రాజకీయాలు వేడెక్కిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ రోజు కల్లెక్టర్స్ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడుతూ, ఢిల్లీ పై ధ్వజమెత్తారు. నేరాలు చేసే వ్యక్తులు రాజకీయ ముసుగులో ఉంటే ప్రమాదమని చంద్రబాబునాయుడు అన్నారు.
ఏదైనా నేరాలు జరిగినప్పుడు పోలీసులు ధైర్యంగా వ్యవహరించాలని.. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన తిత్లీ తుపానుపై స్పందించని కేసీఆర్, కేటీఆర్, కవిత లాంటి వారు జగన్‌పై చిన్న దాడి జరిగిన వెంటనే స్పందించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నారు. గవర్నర్ వ్యవహార శైలి కూడా సరిగా లేదని.. జగన్‌పై దాడి విషయంలో ప్రభుత్వాన్ని సంప్రదించకుండా నేరుగా డీజీపీనే నివేదిక అడగడం ఏంటని ప్రశ్నించారు. గవర్నర్ నేరుగా అధికారులనే సంప్రదిస్తే ఇక తామెందుకుని అన్నారు. ప్రత్యేక హోదా గురించి అడిగితే ఇన్ని దాడులు చేస్తారా? అంటూ కేంద్రాన్ని నిలదీశారు. ఐటీ దాడులతో వ్యాపారులు బెంబేలెత్తుతున్నారని.. అభివృద్ధిని అడ్డుకునే పనులు సమాజానికి మంచివి కావన్నారు.