‘కుట్రలు మొత్తం అర్థమయ్యాయి. దీనిని దేశమంతా చాటిచెబుతా’ అని ప్రకటించిన చంద్రబాబు శనివారం ఢిల్లీకి వెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలను కూడా వెంటనే అక్కడికి చేరుకోవాలని ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన కాన్స్టిట్యూషన్ క్లబ్లో జాతీయ దిన పత్రికలు, చానళ్లతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లక్ష్యంగా ఎంచుకొని పదేపదే ఐటీ దాడులు నిర్వహిస్తున్నారని... ఏపీకి పెట్టుబడులు, పరిశ్రమలు రాకుండా భయపెట్టడం లక్ష్యంగా ఇది జరుగుతోందని ఆయన ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను జాతీయ స్ధాయిలో ఎత్తిచూపి మోదీ ప్రభుత్వాన్ని నిలదీయడమే చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రధాన అజెండాగా తెలుస్తోంది. అన్నిటికంటే, గవర్నర్ టార్గెట్ కా చంద్రబాబు వేగంగా పావులు కదుపుతున్నారు.
జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగినట్లు చెబుతున్న దాడిలో ఘటనలో గవర్నర్ నరసింహన్ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శల పాలవుతోంది. ఏపీ ప్రభుత్వ పెద్దలు గవర్నర్ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. సీఎం చంద్రబాబు నేరుగా గవర్నర్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. అసలు గవర్నర్ల వ్యవస్థపై చర్చ జరుగాలంటున్నారు. ఏపీ ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి నరసింహన్ ఢిల్లీ స్థాయిలో కుట్ర చేస్తున్నారనేది టీడీపీ నేతలు ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. జగన్‌పై దాడి జరిగిందనే ప్రచారం ఊపందుకోకముందే గవర్నర్ ఏపీ డీజీపీకి ఫోన్ చేశారు. ఎయిర్‌పోర్టులో ఏం జరిగిందో.. సీఐఎఫ్ పోలీసుల నుంచి విశాఖ పోలీసులు సమాచారం తీసుకుంటుండగానే గవర్నర్ డీజీపీకి ఫోన్ చేశారు. సీరియస్‌గా రిపోర్ట్ అడిగారు. అసలు ఆ ఘటన జరిగింది.. ఎయిర్‌పోర్టు కేంద్ర పరిధిలో ఉంటుంది. ఆ విషయం గవర్నర్‌కు తెలియంది కాదు.
అదికాక ఏ అధికారంతో డీజీపీకి ఆయన ఫోన్ చేశారనేది టీడీపీ వర్గాల్లో వస్తున్న ప్రధానమైన విమర్శ. తెలంగాణలో ఎన్నో ఘోర ప్రమాదాలు, ఒక్క బస్సు ప్రమాదంలో 60 మంది మరణించిన.. ఆయన ఏ అధికారికి ఎందుకు ఫోన్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు. గవర్నర్ వ్యవస్థ పేపర్ పవర్‌కు మాత్రమే పరిమితం. ఆయన రాజ్‌భవన్‌కు తప్ప మరో దానికి అధికారి కాదు. కనీసం ఒక బంట్రోతును కూడా బదిలీ చేసే అధికారం లేదు. కనీసం ఏ ప్రభుత్వ ఉద్యోగిని కూడా నేరుగా ఫోన్ చేసి ఆదేశించే అధికారం లేదు. అలా ఆదేశిస్తే ఆయన తన అధికార పరిధిని దాటి ప్రజాస్వామ్య సూత్రాలను ఉల్లఘించినట్లేనని టీడీపీ వాదన. ఇప్పుడు గవర్నర్ కచ్చితంగా అదే చేశారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వానికి సంబంధించి సమాచారమో మరేదో కావాలంటే నేరుగా సీఎంతో మాట్లాడాలి. కాని ఇక్కడ గవర్నర్ అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేశారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.