‘‘నేరాలు చేసే వ్యక్తులు రాజకీయ ముసుగులో ఉంటారు. ఇది చాలా ప్రమాదం. ఇలాంటి వారి విషయంలో కఠినంగా ఉండండి. విశాఖ సంఘటనను గమనించండి. పోలీసులు ఎవరికీ భయపడొద్దు. ఏ పార్టీ అయినా సరే.. అల్లర్లు సృష్టించాలని చూస్తే అణచివేయండి’’ అని సీఎం చంద్రబాబు పోలీసు అధికారులకు స్పష్టంచేశారు. ప్రస్తుత సమాజంలో రాజకీయమూ మారిందని, వచ్చే ఆర్నెల్లలో వీటి తీవ్రత పెరగవచ్చని అప్రమత్తం చేశారు. ‘హోదా’ విషయంలో కేంద్రంతో విభేదించగానే రాష్ట్రాన్ని, టీడీపీని లక్ష్యంగా చేసుకుని... ఏకంగా ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకే కుట్ర రాజకీయాలు మొదలయ్యాయని తెలిపారు. విశాఖలో విపక్ష నేత జగన్‌పై దాడి సంగతిని ప్రస్తావించారు. ‘‘ప్రతిపక్ష నేతపై ప్రాణహానిలేని దాడులకు పాల్పడి, బయటి నుంచి మనుషులను రప్పించి, రాష్ట్రంలో అలజడులు సృష్టించి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయాలని పథక రచన చేశారు."
"శాంతి భద్రతల సమస్య లేవనెత్తి ప్రజలు ఐదేళ్లకు ఎన్నుకున్న టీడీపీ ప్రభుత్వాన్ని కూల్చేసి రాష్ట్రపతి పాలన పేరుతో గవర్నర్‌ను రంగంలోకి దించాలనేది ప్లాన్. ఆలోచించి చూడగా విషయం మొత్తం అర్థమైంది. ఈ విషయాన్ని దేశం మొత్తం చాటి చెబుతాను’’ అని చంద్రబాబు ప్రకటించారు. జగన్‌పై దాడి జరిగిన తర్వాత నాలుగు గంటల పాటు పోలీసులు సరిగా వ్యవహరించలేదు. సంఘటన 12.40 గంటలకు జరిగితే డీజీపీ వెంటనే మీడియాతో మాట్లాడారు. మీరందరూ ఎందుకు స్పందించలేదు. నాతో పాటు ఐటీ మంత్రి (లోకేశ్) ఫోటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పంపుతుంటే మీరెందుకు మాట్లాడలేదు? రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పింటే నాతోపాటు డీజీపీ ఆర్పీ ఠాకూర్ దోషులుగా నిలబడాల్సి వచ్చేది. దాడి విషయం తెలియగానే కలెక్టర్ల సదస్సు నుంచి వచ్చేసి పోలీసులకు గట్టిగా ఆదేశాలు జారీ చేయడంతో డీజీపీ ఠాకూర్ గట్టి చర్యలు చేపట్టారు. దీని ఫలితంగా వారి పథకాలు ఫలించలేదు. అందువల్లే నన్ను, డీజీపీని ఏ1, ఏ2గా చేర్చి కేసులు పెట్టాలంటున్నారు.
రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం ఇష్టంలేక ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారు. హిందువులను టీడీపీకి దూరం చేసే కుట్రలో భాగంగా రమణ దీక్షితులును అడ్డు పెట్టుకుని తిరుమల వివాదం తీసుకొచ్చారు. పింక్ డైమండ్ అన్నారు. సుబ్రమణ్యస్వామి ద్వారా కేసులేయిస్తారు. ఏంటని అడిగితే అమిత్ షా చెప్పారని పిటిషనర్ బదులిస్తారు. భవిష్యత్తులో చర్చిలపైనా దాడులు జరగొచ్చు. విభజిత రాష్ట్రం అభివృద్ధి కోసం అహర్నిశలూ శ్రమిస్తుంటే దుష్టశక్తులు అడుగడుగునా అడ్డుపడుతున్నాయి. నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూశాను. కానీ... ఇప్పుడు పడుతోన్న కష్టాలను జీవితంలో ఎన్నడూ చూడలేదు. కేంద్ర ప్రభుత్వంతోపాటు పొరుగు రాష్ట్ర ప్రభుత్వం, స్వరాష్ట్రంలో విపక్షాలు మూకుమ్మడిగా కుట్రలు పన్నుతున్నాయి.