బీజేపీని, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఓ ఉదంతం తాజాగా వెలుగుచూసింది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారీ చనిపోయిన సంగతి తెలిసిందే. ఈయన మన ఏపి గవర్నర్ గా కూడా పని చేసారు. అయితే ఆయన అంత్యక్రియల సమయంలో తన మంత్రివర్గ సహచరులతో కలిసి యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నవ్వులు చిందించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. యోగి చర్య పై విపక్షాలు ఒంటికాలిపై లేస్తున్నాయి. శనివారం రాత్రి ఎన్డీ తివారీ మృతదేహాన్ని లక్నో తీసుకువెళ్లారు. అక్కడ్నించి యూపీ అసెంబ్లీ వద్ద ప్రజా సందర్శనార్థం ఉంచారు.
దీంతో సీనియర్ నేతలంతా తివారీకి నివాళులర్పించారు. యోగి ఆదిత్యనాథ్ సైతం తన మంత్రులతో కలిసి వచ్చారు. మొదటి వరుసలో యోగి, బీహార్ గవర్నర్ లాల్జీ టాండన్‌లు కూర్చోగా, యూపీ మంత్రులు మెహసిన్ రజా, అశుతోష్ టాండన్‌లు వారి వెనుక కూర్చున్నారు. ఎన్డీ తివారీ భౌతికకాయానికి సమీపంలోనే వారు కూర్చున్నారు. ఆదిత్యనాథ్ వెనక్కి తిరిగి టాండన్, రజాలతో మాట్లాడుతుండటం, వారంతా కలిసి ఒక్కసారిగా నవ్వుకోవడం కెమెరాలో చిక్కింది. దీంతో విపక్షాలు ఒక్కసారిగా యోగి ఆదిత్యనాథ్‌పై మండిపడ్డాయి. సీఎంగా, గవర్నర్‌గా కీలక పదవులు చేపట్టిన రాజకీయ కురువృద్ధుడు చనిపోతే అతని మృతదేహాన్ని పక్కనే పెట్టుకుని 'జోక్స్' కట్ చేస్తారా? అని కాంగ్రెస్ ప్రతినిధి జిషాన్ హైదర్ మండిపడ్డారు.
'ఇలాంటి సందర్భాలను బీజేపీ కేవలం ఫోటోలు దిగే సందర్భంగానే చూస్తుంది. అది...అటల్ బిహారీ వాజ్‌పేయి కావచ్చు... తివారీ అయినా కావచ్చు. వాళ్ల పార్ధివదేహాన్ని పక్కనే ఉంచుకుని నవ్వుకుంటున్నారంటే వారెంత నిర్దయులో అర్ధం చేసుకోవచ్చు' అని ఆయన మండిపడ్డారు. సమాజ్‌వాదీ పార్టీ సైతం యోగిని తప్పుపట్టింది. భారతీయ జనతా పార్టీ నిజ స్వరూపం ఇదేనని, మృతదేహాన్ని పక్కన పెట్టుకుని నవ్వులు రువ్వడమంటే మానవత్వాన్ని మంటకలపడమేనని ఆపార్టీ ప్రతినిధి అనురాఘ్ భదౌరియా అన్నారు. 'అలాంటి వ్యక్తులకు చావు, పుట్టుకల విలువ తెలియదు. వారికిది కేవలం రాజకీయ అంశమే' అని యోగి, ఆయన మంత్రివర్గ సహచరులను ఆయన తప్పుపట్టారు.