దళారీల్లేరు. పైరవీలు అసలే లేవు. సిఫారసులు ఊసే లేదు. లంచం మాటే లేదు. అంతా ఆన్‌లైన్. అందుకే లక్ష్యం లక్షలు దాటింది. 3 లక్షల మందికి పైగా ముఖ్యమంత్రి యువనేస్తాలయ్యారు. వీరంతా నిరుద్యోగభృతి అందుకుంటూనే, వివిధ రంగాలలో నైపుణ్యం సాధించి..ఉద్యోగులై ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక భాగస్వాములు కానున్నారు. ముఖ్యమంత్రి యువనేస్తం పథకం అమలుకు కోసం మంత్రి నారా లోకేష్ రూపొందించిన అత్యంత పకడ్బందీ పారదర్శక వ్యవస్థ ఇస్తున్న సత్ఫలితాలు ఇవి. పథకం ప్రారంభించిన 36 రోజుల్లో 3 లక్షల 20 మందికి పైగా యువత ఈ పథకానికి ఎంపికయ్యారు. ఇది దేశంలో ఏ రాష్ట్రమూ సాధించని రికార్డు. ఇప్పటివరకూ అర్హుల సంఖ్య 3 లక్షల 20 మందిగా నమోదయ్యారు. ముఖ్యమంత్రి యువనేస్తం పథకం వెబ్‌సైట్‌ని 5 వారాల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. ఇప్పటివరకూ 3 లక్షల 20 మంది యువత పథకానికి అర్హత సాధించారు. స్వచ్ఛందంగా భృతి వదులుకున్న వారు 10,378 కాగా..వీరుకూడా పొరపాటున ఈ ఆప్షన్ ఎంచుకున్నారేమోనని 1100 నుంచి ఫోన్ చేసి ఆరాతీసి..పొరపాటున అని చెబితే వారినీ అర్హుల జాబితాకు మార్చుతున్నారు.
వివిధ సమస్యలపై దరఖాస్తుదారుల నుంచి ఇప్పటివరకూ వచ్చిన ఫిర్యాదుల్లో 1,24,324 పరిష్కరించగా, 35,767 పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి కూడా అతిత్వరలో పరిష్కరించి వారికి భృతిని అందజేయనున్నారు. ఇప్పటి వరకూ 1,70,413 మంది ఖాతాల్లో నిరుద్యోగభృతి జమ అయ్యింది. వీరందరికీ నవంబర్ 1 నుంచి భృతి ఖాతాలకు నేరుగా జమ చేయనున్నారు. దరఖాస్తుకు చివరి గడువు లేదు.యువనేస్తం పథకానికి ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఎటువంటి గడువు లేదు. అయితే ప్రతీనెలా 25వ తేదీ మాత్రం ఆ నెలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపికకు కటాఫ్‌గా నిర్ణయించారు. అలా చేయడం వల్ల 25వ తేదీలోగా వచ్చేఅర్హులకు తరువాతి నెల 1వ తేదీ నుంచి భృతి నేరుగా ఖాతాలో జమచేయనున్నారు. అంతకుమించి ఈ పథకానికి దరఖాస్తు చేసే చివరి తేదీ అంటూ ఏదీ లేదని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ప్రారంభానికి ముందే యువత చాల సులభంగా ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకునే విధంగా వెబ్‌సైట్‌ని రూపొందించారు.
వెబ్‌సైట్ లాంచ్ అయిన తరువాత..భూమి నిబంధన, పాత పీఎఫ్ అక్కౌంట్లు కలిగి ఉండటం,బ్యాంకు అక్కౌంట్లు మనుగడలో లేకపోవడం, డిగ్రీల సర్టిఫికెట్లను త్వరగా నిర్ధారించకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి.వీటినీ పరిష్కరించారు. సమస్య ఏదైనా పరిష్కారమే లక్ష్యంగా పథకాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ..ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోంది. ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి ఇప్పటివరకూ వచ్చిన దరఖాస్తుల్లో అర్హులలో అత్యధికశాతం పురుషులే ఉండటంతో..మహిళల్లో అవగాహన పెంచాలని నిర్ణయించుకున్నారు. నిరుద్యోగభృతి అంటే నెలనెలా రూ.1000 చెల్లింపు ఒక్కటే కాదని, నైపుణ్యశిక్షణ ఇచ్చి ఉద్యోగాలు సాధించేలా తీర్చిదిద్దడం కూడా ఇందులో భాగమనే విషయంపై పెద్ద ఎత్తున ప్రచారం చేయనున్నారు. దీనికోసం సాధికారమిత్రలు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయనున్నారు.అలాగే దరఖాస్తు చేసుకునేందుకు సహకారం ఇవ్వనున్నారు.