పోలవరం ప్రాజెక్టులో కీలకమైన గేట్ల బిగింపునకు ముహూర్తాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. డిసెంబర్ 17న గేట్ల బిగింపును మొదలుపెట్టాలని జలవనరుల శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకోసం 60x20 మీటర్ల కొలతలతో మొత్తం 48 గేట్లను సిద్ధం చేసినట్టు అధికారులు వివరించారు. ఏప్రిల్ నెలాఖరు కల్లా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కాఫర్ డ్యామ్, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్ సహా ప్రధానమైన పనులు అన్నీ పూర్తి చేస్తామని అధికారులు తెలుపగా, నెలకు 10 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు ఉత్పత్తి చేసే క్రషర్లు ఇక నుంచి వినియోగిస్తున్నామని నిర్మాణ సంస్థల ప్రతినిధులు వెల్లడించారు. ప్రపంచ రికార్డులు అన్నీ తిరగరాసేలా అత్యంత వేగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు జరగాలని ముఖ్యమంత్రి అన్నారు. సోమవారం ఉండవల్లిలోని ప్రజావేదికలో పోలవరం ప్రాజెక్టుతో సహా ప్రాధాన్య ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
పోలవరం ప్రాజెక్టుపై 80వ సారి వర్చువల్ రివ్యూ నిర్వహించిన ముఖ్యమంత్రికి కాంక్రీట్ పనులు అత్యంత వేగంగా చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు మొత్తం 60.33% పూర్తికాగా, తవ్వకం పనులు 80.10%, కాంక్రీట్ పనులు 45.60% పూర్తయినట్టు తెలిపారు. కుడి ప్రధాన కాలువ 90%, ఎడమ ప్రధాన కాలువ 65.03%, రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 61.91% పూర్తయినట్టు పేర్కొన్నారు. గత వారం స్పిల్ చానల్, స్పిల్ వే, పైలట్ చానల్, అప్రోచ్ చానల్, లెఫ్ట్ ఫ్లాంక్‌కు సంబంధించి 4.47 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు, స్పిల్ వే, స్పిల్ చానల్, స్టిల్లింగ్ బేసిన్‌కు సంబంధించి 52 వేల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు పూర్తయినట్టు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు నిర్మిస్తున్న కాలనీలలో మొదటిదశ పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి గడువు విధించారు.
గడిచిన వారంలో 12% శాతం పనులు పూర్తిచేశామని అధికారులు వివరించారు. తూర్పుగోదావరి జిల్లాలో నిర్మిస్తున్న 17 కాలనీలకు సంబంధించి 46% పనులు, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్మిస్తున్న 29 కాలనీలకు సంబంధించి 42% పనులు పూర్తయ్యాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే రహదారి ఉబికి, కుంగి, బీటలు వారిన దృశ్యాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. పోలవరం ప్రాంతంలో ఎటువంటి భూప్రకంపనలు కానీ, పేలుడు వంటివి జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. రహదారి కుంగిపోవడం వల్ల దెబ్బతిన్న విద్యుత్ లైన్లు సరిజేసి సరఫరా పునరుద్ధరించామని చెప్పారు. మట్టి నమూనాలు పరిశోధనశాలకు పంపి రహదారి ఎందుకు బీటలు వారిందో తెలుసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. మరోవైపు గోదావరి-పెన్నా మొదటిదశకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు ఈ నెలాఖరుకల్లా అన్ని ప్రాధాన్య ప్రాజెక్టులకు టెండర్లు పిలవడం పూర్తి కావాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు.