సీబీఐలో తాజాగా నెలకొన్న పరిస్థితులపై ఆరా తీసేందుకు దిల్లీకి చెందిన బృందం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న బృందం శుక్రవారం కాకినాడలో, శనివారం రాజమహేంద్రవరంలో పర్యటించిందన్న ప్రచారం సాగుతోంది. ఆదివారం ఉదయం కాకినాడలోని సానా సతీష్‌బాబుకు చెందిన అతిధిగృహంలో సీబీఐ అధికారులు సోదాలు జరిపారు. గెస్ట్ హౌస్ లోనేగాక ఆయన బంధువుల ఇళ్లల్లో కూడా సోదాలు జరిపారు. సీబీఐ డైరెక్టర్ల మధ్య చిచ్చుకు సతీష్‌బాబు వాంగ్మూలం కారణమైందన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ సోదాలు జరగడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. హైదరాబాద్‌లో ఉంటున్న సాన సతీష్‌బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానా, డీఎస్పీ దేవేంద్రకుమార్‌లపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఫిర్యాదు ఇచ్చిన సతీష్‌బాబు ఎవరు? ఆయనకు రాజకీయ, ఇతర పెద్దలతో ఏమైనా పరిచయాలున్నాయా? గత చరిత్ర తదితర అంశాలపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. సీబీఐ బృందం పర్యటనపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా లేదు. కాకినాడకు చెందిన సాన సతీష్‌బాబు తండ్రి విద్యుత్‌శాఖలో ఏఈగా పనిచేస్తూ మరణించారు. పాలిటెక్నిక్ డిప్లొమో చదివిన సతీష్‌బాబుకు కారుణ్య నియామకం కింద అదే శాఖలో సబ్‌ఇంజినీరు ఉద్యోగం లభించింది. కాకినాడలో పనిచేస్తూ 2004లో దీర్ఘకాలిక సెలవు పెట్టారు. 2005లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం గుత్తేదారుగా మారి పలు వ్యాపారాలు చేశారు. పలు సంస్థలకు డైరెక్టర్‌గానూ వ్యవహరించారు.
ఉద్యోగం వదిలి 14 ఏళ్ల కిందటే ఆయన హైదరాబాద్ వెళ్లారు. 2007 ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శిగానూ వ్యవహరించినందున అప్పట్లో వివాదాస్పద వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా? తదితర అంశాలను కూడా సేకరిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కాకినాడలోని పాతబస్టాండు సమీపంలో ఉప్పుటేరుకు అవతల మేడలైన్ అనే రెవెన్యూ గ్రామం ఉంది. ఇక్కడ ప్రైవేటుగా సాగిన భూసమీకరణ వ్యవహారంలో ఆయన పాత్ర ఉందా? ఇక్కడ నిర్మిస్తున్న ప్రైవేటు వంతెనకు అనుమతులు ఎలా ఇచ్చారు? తదితర అంశాలపైనా ఆరా తీస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.