ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో నేషనల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగ న్‌పై జరిగిన దాడి ఘటన గురించి ప్రస్తావించారు. విశాఖపట్నం విమానాశ్రయంలో తాజాగా ఓ ఘటన జరిగిందని, ప్రతిపక్ష నేత ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన సమయంలో శ్రీనివాస్ అనే వ్యక్తి ఓ చిన్న కత్తితో దాడి చేశాడని తెలిపారు. ఈ విషయం తెలియగానే.. తాము విచారణకు ఆదేశించామని చెప్పారు. విమానాశ్రయాలు కేంద్ర పరిధిలో ఉండే సీఐఎస్‌ఎఫ్ ఆధీనంలో ఉంటాయని.. ఘటన జరిగింది ఎయిర్‌పోర్ట్ లోపలేనని చంద్రబాబు చెప్పారు. ఘటన జరిగిన అనంతరం దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, అతని వద్ద 10పేజీల లేఖ దొరికిందని ఆయన జాతీయ మీడియాకు వివరించారు.
ఈ ఘటన జరిగిన వెంటనే బీజేపీ నేతలు టీడీపీని విమర్శించారని చెప్పారు. అయితే.. ఘటన జరిగింది విమానాశ్రయం లోపల అని.. ఎయిర్‌పోర్ట్ కేంద్ర బలగాల ఆధీనంలో ఉంటుందని చంద్రబాబు గుర్తుచేశారు. కేంద్రం పరిధిలో ఉన్న చోట ఘటన జరిగితే.. తమను బాధ్యులను చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఘటన జరిగిన తర్వాత గవర్నర్ రాష్ట్ర డీజీపీకి ఫోన్ చేశారని.. సహజంగా గవర్నర్‌కు ఏ సమాచారమైనా కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తారని చంద్రబాబు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న విమానాశ్రయంలో దాడి జరిగితే మమ్మల్ని నిందిస్తే ఎలా? ఇది కచ్చితంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే’ అని మండిపడ్డారు.
మూడునాలుగు నెలల క్రితం శివాజీ ‘ఆపరేషన్ గరుడ’ అనే ఓ అంశాన్ని తెరపైకి తెచ్చాడని... మొదట్లో తాను నమ్మలేదని చంద్రబాబు చెప్పారు. ‘ఆపరేషన్ గరుడ’లో శివాజీ ఏ అంశాలను వివరించాడో.. ప్రస్తుతం సరిగ్గా అదే మాదిరి ఘటనలు జరుగుతున్నాయని చంద్రబాబు తెలిపారు. ఈ పరిణామాలతో తాను షాక్‌కు లోనయ్యానని సీఎం చెప్పారు. దేశవ్యాప్తంగా రైడ్స్ జరుగుతాయని శివాజీ చెప్పాడని... తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణలో అదే తరహాలో రైడ్స్ జరిగాయని చంద్రబాబు తెలిపారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆస్తులపై రైడ్స్ జరిగాయని చెప్పారు. తాము బీజేపీతో కలిసి ఉన్నన్నాళ్లు తమపై ఎలాంటి ఐటీ దాడులు జరగలేదని, పొత్తు తెగతెంపులు చేసుకున్న అనంతరం ఐటీ దాడులు జరిగాయని చంద్రబాబు గుర్తుచేశారు.