ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దేశ రాజధాని ఢిల్లీలో, ప్రధాని మోడీ దేశానికీ, రాష్ట్రానికి చేసిన మోసాన్ని, ప్రతి విషయం ఆధారాలతో సహా నేషనల్ మీడియాకు చూపిస్తూ, మోడీ-షా విధానాలని చాకిరేవు పెట్టారు.... స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే రాష్ట్రాలు, వ్యక్తుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షతో వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. నాలుగున్నరేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసిన సాయంపైనా నిలదీసిన చంద్రబాబు.. దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలనలో వైఫల్యాలను దిల్లీ వేదికగా ఎండగట్టారు. ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం కుట్రపూరిత వైఖరి అనుసరిస్తోందని ధ్వజమెత్తడంతో పాటు రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను దిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో జాతీయ మీడియాకు సీఎం వివరించారు.
‘‘దేశంలో ఏం జరుగుతోందో వివరించడానికే మీ ముందుకొచ్చాను. రాష్ట్రంలో ఆర్థిక ప్రగతి తిరోగమనంలో ఉన్న పరిస్థితుల్లో మేం అధికారంలోకి వచ్చాం. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఏపీలో ఒక్కసారిగా 19 ఐటీ బృందాలను దాడులకు పురిగొల్పారు. నల్లధనం వెనక్కి తీసుకొస్తామని కేంద్రం చెప్పింది. అలాంటిదేమీ ఏమీ జరగలేదు. ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్లో నగదు జమచేస్తామన్నారు.డాలర్‌తో రూపాయి మారకపు విలువ విపరీతంగా పెరిగింది. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. ఎప్పుడు చేస్తారు? రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని కేంద్రం చెప్పింది. ఎప్పుడు పూర్తి చేస్తారు? రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు.. ఎప్పుడు చేస్తారు? వ్యవసాయంలో 3శాతం వృద్ధి మాత్రమే ఉంది’’ అని చంద్రబాబు అన్నారు.
‘‘ ఏపీ విభజన హామీలు కేంద్రం నెరవేర్చలేదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. కానీ, ఇప్పటివరకు ఎలాంటి నిధులు ఇవ్వలేదు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు వైకాపా మద్దతును భాజపా తీసుకుంది. వైకాపా, భాజపా మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది. రాష్ట్రంలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు కేవలం రూ.250 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇచ్చిన నిధులను కూడా ఇటీవల వాపస్ తీసుకున్నారు. విభజన చట్టంలోని 18 హామీలను నెరవేరుస్తామని ప్రధాని చెప్పారు. కానీ ఏ ఒక్క హామీనీ సరిగ్గా నెరవేర్చలేదు. హుద్‌హుద్ తుపాను సమయంలో రూ.1000 కోట్లు ఇస్తామన్నారు. కేవలం రూ.650 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చింది. తెలంగాణలో తొమ్మిది జిల్లాలకు మాత్రం రూ.450 కోట్లు ఇచ్చారు. అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి.. ఈ పరిస్థితుల్లో అక్కడ మీరు నిధులు ఇవ్వొచ్చు.. అది రాజకీయ కారణం. నేను అర్థంచేసుకోగలను. కానీ ఆంధ్రప్రదేశ్‌కు నిధులు ఇవ్వకపోవడం వివక్ష కాదా? రాష్ట్రంలో తిత్లీ తుపాను వస్తే పరిశీలనకు కేంద్రమంత్రులు రాలేదు. గుంటూరులో పార్టీ కార్యాలయం ప్రారంభించి రాజ్‌నాథ్‌సింగ్ దిల్లీకి వెళ్లిపోయారు గానీ.. తిత్లీ బాధితులను పరామర్శించేందుకు రాలేదు’’ అని చంద్రబాబు అన్నారు.