2014 ముందు వరకు, తాగేందుకు నీళ్ళు కూడా లేని జిల్లా అది. తర తరాలుగా కరువుతో అల్లాడే జిల్లాగా పేరుంది. అలాంటి జిల్లాలో చంద్రబాబు చొరవతో, పాతాళ గంగ ఉప్పొంగింది. పట్టిసీమ నీరు కృష్ణా డెల్టాకు రావటంతో, కృష్ణా జలాలు అన్నీ ఇటు వైపు మళ్ళాయి. దీంతో ఒకప్పుడు తాగటానికి నీళ్ళు లేని చోట, ఇప్పుడు బోటు షికార్ జరుగుతుంది. అనంతపురం జిల్లాలో ఎప్పుడు చూసినా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. తాగు, సాగునీటి కోసం అధికారపార్టీ ఎమ్మెల్యేలే తగువులాడుకుంటారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిల్లో ఉన్న జిల్లాలో బోటు షికార్లు ఏమిటా? అనే ప్రశ్న ఉదయిస్తుంది. కానీ అక్కడి దృశ్యాలు చూస్తే మాత్రం "ఔరా!'' అని మీరు ఆశ్చర్యపోక తప్పదు.
నీటి కొరతగా పేరున్న జిల్లా అనంతపురంలో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి బోటు షికారును ప్రారంభించారు. అనంతపురం నగర నడిబొడ్డు నుంచి మిడ్ పెన్నార్ దక్షిణ కాలవ పులివెందులకు వెళుతుంది. కాలువకు ఆనుకొని అనంతపురం శిల్పారామం ఉంది. తడకలేరు వాగుమీద రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్.. షార్ట్‌కట్‌లో చెప్పాలంటే ఆర్‌డీటీ సహకారంతో కోటిన్నర రూపాయలు ఖర్చుపెట్టి పెద్ద చెక్‌డ్యామ్ నిర్మించారు. హెచ్ఎల్‌సీ నీరు శింగనమల చెరువుకు ఈ చెక్‌డ్యామ్ నుంచి వెళుతుంది. ఈ నేపథ్యంలోనే అనంత ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఓ ఆలోచన చేశారు. అనంత ప్రజలకు ఆటవిడుపునిచ్చే పిక్నిక్ సెంటర్లు లేవు. కనుక కొన్ని బోట్లు రప్పించి చెక్‌డ్యామ్‌లో వేయించారు.
వీటిలో షికారు చేసే అవకాశం ప్రజలకు కల్పించారు. ఇటీవలే ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, మేయర్ స్వరూప, డిప్యూటీ మేయర్ గంపన్న ఈ ఆహ్లాదకర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి బోటు షికారు చేస్తూ సెల్‌ఫోన్‌లో పరిసరాలను చిత్రీకరించారు. ఈ సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది. "ఎమ్మెల్యే మంచి ఆలోచన చేశారు. బోటు షికారు వల్ల ప్రజలకేమో ఆటవిడుపు. వసూలు చేసే రుసుము వల్ల సర్కారుకి ఆదాయం'' అంటూ కొందరు ప్రభాకర్‌చౌదరిని అభినందిస్తున్నారు. అనంతపురం వాసుల మదిని గెలిచే ఆలోచనలు చేయడం ద్వారా ప్రభాకర్ చౌదరి తన ఓట్‌బ్యాంక్‌ని పెంచుకుంటున్నారని పరిశీలకులు కూడా అంటున్నారు. ముఖ్యంగా పర్యాటక ప్రేమికులు, యువత ఆయన పనులను ప్రశంసిస్తున్నారు.