ఎంతో సహనంతో రాష్ట్రం కోసం నాలుగేళ్లు ఓపిగ్గా ఎదురుచూశానని, ఢిల్లి చుట్టూ తిరిగినా మోడీ ప్రభుత్వం హామీలు నెరవేర్చ లేదని, అందువల్లే తిరగబడి బయటకు వచ్చానని, ఇప్పుడు విపక్ష పార్టీలను కూడగట్టి మెడలు వంచుతా నని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్ర అభి వృద్ధితోపాటు తాజా రాజకీయ పరిణామాలను వివరిస్తూ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. శుక్రవారం ప్రకాశం జిల్లా పర్చూరు నియోజక వర్గం మార్టూరులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కోసం తాను పడుతున్న శ్రమకు అడుగడుగునా అడ్డం పడతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించడమే కాకుండా, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని, ఈ సమ యంలో దేశంలోనే ఓ సీనియర్ రాజకీయ నాయకుడిగా తనవంతు బాధ్యత నిర్వర్తించాల్సిన సమయం ఆసన్న మైనదని భావించానన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకతాటి మీదకు తె చ్చి వారికి బుద్ధిచెప్పేందుకు సిద్ధమయ్యానన్నారు.
తానేం చేసినా తన స్వార్థం కోసం చేయడం లేదని, దేశం కోసం, భవిష్యత్ తరాల కోసం చేస్తున్నానని, దీనికి ప్రజల అండ కావాలని చంద్రబాబు కోరారు. ఏకపక్షంగా తనకు మద్దతు తెలిపి, 25 ఎంపీ సీట్లనూ గెలిపిస్తే ఢిల్లిని శాసిస్తానని, తాను చేయబోతున్న ఈ పోరాటానికి ప్రజలందరూ మద్దతు పలకాలని సభా ముఖంగా విజ్ఞప్తి చేశారు. భావితరాల భవిష్యత్తు కోసమే దశాబ్దాల వైరాన్నీ పక్కనబెట్టి కాంగ్రెస్‌తో చేతులు కలిపానని చంద్రబాబు అన్నారు. తనకు హస్తినకు వెళ్లే ఆలోచన లేదని, ఇక్కడే ఉండి కష్టపడతానన్నారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌కు న మ్మక ద్రోహం చేసిందని, ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేసిందన్నారు. అదేమని అడిగితే దగా చేయడం మొదలెట్టారని, దీంతో తాను ధర్మపోరాటం చేస్తున్నానన్నారు.
తనను ఏమీ చేయలేక తనను నమ్ముకున్న వారిపై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై, తెలుగు ప్రజలపై బీజేపీ కక్ష కట్టిందన్నారు. ఇన్‌కం ట్యాక్స్ దాడులు చేయించి భయపెట్టే పరిస్థితి తీసుకువచ్చారన్నారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారన్నారు. రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని, అయితే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మీకేం చేసిందంటూ ప్రజలను ప్రశ్నించారు. నోట్లు రద్దు చేసి, ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేశారని, జీఎస్టీ అమలు చేయలేక చతికల పడ్డారని, పెట్రోల్, డీజల్ ధరలు అడ్డగోలుగా పెంచేశారన్నారు. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని రూపాయి విలువ పడిపోయిందన్నారు. ప్రజల సంక్షేమం పట్టకపోగా రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారన్నారు. సీబీఐ, ఆర్బీఐ లాంటి వ్యవస్థలను నిర్వీర్యం చేశారన్నారు. ఈ దశలో దేశంలోనే ఒక సీనియర్ నాయకుడిగా నా బాధ్యతగా ఢిల్లి వెళ్లి అన్ని పార్టీలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు. తెలుగువారికి అన్యాయం జరిగితే బొబ్బిలిపులిలా విజృంభించాలని నాడు ఎన్టీఆర్ పిలుపునిచ్చారని, తెలుగువాడి ఆత్మగౌరవం దెబ్బతినే సమయంలో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లి వాళ్లను ఎదుర్కోవడమే తనకు తెలిసిన విద్యని చంద్రబాబు పేర్కొన్నారు.