పోలవరం ప్రాజెక్టులో నిర్వాసిత కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు మరో వరం ప్రకటించారు. ప్రస్తుతం ముంపు ప్రాంతాల్లో గిరిజన కుటుంబాలకు నిర్మిస్తున్న ఇళ్లకు అదనంగా రూ.75 వేలు ఇస్తున్నట్లుగానే.. గిరిజనేతర కుటుంబాలకు కూడా అదనంగా రూ.50 వేల చొప్పున ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల ప్రభుత్వంపై అదనంగా రూ.245.53 కోట్ల భారం పడుతుంది. అయితే ప్రతి నిర్వాసిత కుటుంబం సంతోషంగా ఉండడమే తనకు ముఖ్యమని.. ఇందుకోసం ఎన్ని కోట్లు ఖర్చు చేసేందుకైనా వెనుకాడేదిలేదని సీఎం స్పష్టం చేశారు. దీంతో పాటు ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మాణం కోసం రూ.15 వేలు అదనంగా ఇవ్వాలని సూచించారు.
సోమవారం సచివాలయంలో పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ఆయన సమీక్ష జరిపారు. జనవరికల్లా 48 కాలనీలు నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. పునరావసం, పరిహారానికి చెందిన సమాచారమంతా ఆన్‌లైన్‌లో అందరికీ అందుబాటులో ఉంచాలని చెప్పారు. నిర్వాసితులు ప్రభుత్వం నిర్మించే గృహ విస్తీర్ణం కన్నా మరింత విశాలంగా ఇళ్లు నిర్మించుకోవాలనుకుంటే ఎలాంటి అభ్యంతరం చెప్పవద్దన్నారు. వీలైతే బ్యాంకుల నుంచి వారు రుణాలు పొందేందుకు సహకరించాలని సూచించారు. ప్రాజెక్టు నిర్మాణం ప్రాంతంలోని 8 గ్రామాల్లోని 3,992 నిర్వాసిత కుటుంబాలకు 2014లో పునరావాసం పూర్తయింది. ఇంకా 16,048 నిర్వాసిత కుటుంబాలను తరలించాలి.
వీరికోసం 48 కాలనీల నిర్మాణం కొనసాగుతోంది. 2013 భూసేరణ చట్టం ప్రకారం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని ఒక్కో నిర్వాసిత కుటుంబానికి అందిస్తారు. పునరావాస కాలనీలకు తరలి వెళ్లేందుకు రూ.5,00,000.. 12 నెలలకు రూ.36 వేల గ్రాంటు (నెలకు రూ.3,000 చొప్పున), ఎస్సీ, ఎస్టీల తరలింపునకు అదనంగా రూ.50 వేలు, చేతివృత్తుల వారికి, వ్యాపారులకు అదనంగా రూ.25 వేలు, పశుశాలకు అదనంగా రూ.25 వేలు.. ఒక్కో నిర్వాసిత కుటుంబానికి ఇంటి స్థలం (243 చదరపు గజాలు) రూ.1,00,000, ఇంటి నిర్మాణానికి (ఐఏవై) రూ.2,84,000, ఎస్టీ కుటుంబాలకు అదనంగా రూ.75 వేలు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రూ.6,86,000, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఒక్కో కుటుంబానికి రూ.7,00,000.. మొత్తం రూ.18,45,000. ఎస్టీయేతరులకు రూ.18,20,000 వ్యయమవుతుంది.