తఫాను బాధితులు అధైర్యపడవద్దని.. ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. పలాస మండలం గరుడుబద్రలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా తుఫాన్ బాధితుల సమస్యలను సీఎం అడిగి తెలుసుకున్నారు. భారీ ఎత్తున విపత్తు జరిగితే కేంద్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రాన్ని ఆర్థిక సాయం అడిగితే ఐటీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే ఆదుకునే బాధ్యత కేంద్రానికి లేదా? అని అడిగారు.
కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ రాజకీయం కోసం విజయవాడ వచ్చారని చెప్పారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ కోర్టుకెళ్లడానికి పాదయాత్ర వాయిదా వేస్తారు కానీ.. తుఫాను బాధితులను పరామర్శించడానికి వాయిదా వేయలేరా? అని నిలదీశారు. జగన్ పక్క జిల్లాలో ఉండి కూడా తుఫాన్ బాధితులను పరామర్శించడానికి రాలేదని విమర్శించారు. పరామర్శించకపోగా.. తాను దగ్గరుండి పనిచేస్తుంటే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని ధ్వజమెత్తారు. మంత్రులు, అధికారులు కూడా సామాన్యుల్లా కష్టపడుతున్నారని సీఎం గుర్తుచేశారు.
మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విజయవాడ వచ్చారు. మంగళవారం ఆయన గుంటూరు ఇన్నర్ రింగ్‌రోడ్డు వద్ద భాజపా రాష్ట్ర కార్యాలయ భవనానికి శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడారు. రాజకీయ అవసరాల కోసమే చంద్రబాబు ప్రత్యేక హోదా పేరుతో యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. విజయవాడ అభివృద్ధికి రూ.1000 కోట్లు, అమరావతి నిర్మాణానికి రూ.1500 కోట్లు ఇచ్చామని రాష్ట్రానికి ఇచ్చిన నిధుల వివరాలను రాజ్‌నాథ్ చెప్పుకొచ్చారు. పోలవరం నిర్మాణానికి నూటికి నూరు శాతం నిధులు ఇస్తున్నట్టు స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఎనిమిది బెటాలియన్లు మంజూరు చేశామని, అదీ రాష్ట్ర అభివృద్ధి పట్ల తమ నిబద్ధత అన్నారు.