చలించే ప్రతి హృదయానికి.. అక్టోబర్ 11న 165 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు, వరదలు, 10 సెం. మీ నుంచి 43 సెం. మీ. భీకర వర్షంతో తిత్లీ తుఫాను శ్రీకాకుళం తీర ప్రాంతాల్లో విరుచుకుపడింది. గౌర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలో ప్రభుత్వం సకాలంలో స్పందించి లోద్వారా భారీ ప్రాణ నష్టాన్ని నివారించగలిగింది. శ్రీకాకుళంలో 23 మండలాలు, 1114 గ్రామాలు, 2517 నివాస ప్రాంతాలు మరియు 6 పట్టణాల్లో తిత్లీ తుఫాను మునుపెన్నడూ ఎరుగని విధ్వంసాన్ని సృష్టించింది. రహదారులు, పంటలు, మౌలిక వసతులు, వేలాది గృహాలు, ప్రాథమిక సౌకర్యాలు తుఫాను వల్ల భారీగా దెబ్బతిన్నాయి. తుఫాను ధాటికి 36 వేలకు పైగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి, 2 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు, 2.5 లక్షల హెక్టార్ల వ్యవసాయ పంటలు, 36 వేల హెక్టార్ల ఉద్యాన పంటలను నష్టపోయిన రైతుల బాధని చూసి నా హృదయం ద్రవించింది.
అక్టోబర్ 12 నుంచి ప్రభావిత ప్రాంతంలోనే ఉంటూ వేలాది మంది ప్రజల బాధలను స్వయంగా తెలుసుకొని అధికారుల్ని సమన్వయము చేస్తూ నా పూర్తి బాధ్యతలని వినియోగించి బాధితుల కష్టాలను తొలగించేందుకు నా శాయశక్తులా కృషి చేస్తున్నాను. ఇప్పటికే విభజన కష్టాలను ఎదుర్కొంటూ, లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రానికి తిత్లీ తుఫాను రూ. 3435 కోట్ల భారీ నష్టాన్ని మిగిల్చింది. ( విద్యుత్ : రూ. 505 కోట్లు, R&B రూ. 406 కోట్లు, PR&RD : రూ. 140 కోట్లు, వ్యవసాయం : రూ. 802 కోట్లు, హార్టికల్చర్ : రూ. 1000 కోట్లు, పశుసంరక్షణ : రూ. 50 కోట్లు, మత్స్యకారులు : రూ. 50 కోట్లు, RWS : రూ. 100 కోట్లు, ఇరిగేషన్ : రూ. 100 కోట్లు, నివాస గృహాలు : రూ. 220 కోట్లు, సివిల్ సప్లైస్ : రూ. 50 కోట్లు, మెడికల్ & హెల్త్ : రూ. 1 కోటి, పట్టణాభివృద్ధి : రూ. 9 కోట్లు.. మొదలగునవి )
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, సంబంధిత మంత్రులు, వేలాది మంది ఉద్యోగులు బాధితులకు ఆహరం, మంచినీరు, విధ్యుత్ వంటి కనీస సౌకర్యాలను పునరుద్ధరించడానికి నిద్రాహారాలు మాని పని చేస్తున్నారు. నష్టాన్ని అంచనా వేయడానికి, బాధాతప్త హృదయాలలో భరోసా కల్పించి వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి ప్రత్యేక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. శ్రీకాకుళం తిరిగి సాధారణ పరిస్థితికి రావడనికి చాలా సమయం పడుతుంది. అంతవరకు ఆ ప్రాంతాన్ని మేము పసిపాపలా కాపాడుకుంటాం. ఈ ఆపద సమయంలో శ్రీకాకుళం ప్రజలకు మీ సహకారం అందించాల్సిందిగా కోరుతున్నాను. సీఎం సహాయనిధికి విరాళాల రూపంలో మీ ఆపన్న హస్తాన్ని అందించి వారిని తిరిగి తమ కాళ్ళమీద నిలబడేలా చేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. స్మార్ట్ విలేజ్ కార్యక్రమం కింద దెబ్బతున్న గ్రామాలను కూడా మీరు దత్తత తీసుకోవచ్చు ( www.smart.ap.gov.in ) రండి.. మీ వంతుగా సహకారం అందించండి. పేరు : CM Relief Fund, బ్యాంకు : ఆంధ్రాబ్యాంక్, ఏపీ సచివాలయం బ్రాంచ్, వెలగపూడి, అకౌంట్ నెంబర్ : 110310100029039, IFSC Code : ANDB0003079... మీ భవదీయుడు, నారా లోకేష్, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ITE&C శాఖా మంత్రి , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం