రాష్ట్రంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కారణంగా, అస్తవ్యస్త పరిస్థితి ఉంది. ఎక్కడ చెత్త అక్కడే ఉండి పోయింది. ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నా, మునిసిపల్ కార్మికులు మాత్రం పట్టు వీడటం లేదు. దీంతో చెత్త పేరుకుపోయి, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కారణంగా రాష్ట్రంలో చెత్త నిల్వ చేరుకుని అనారోగ్య పరిస్థితి కి దారితీస్తోంది. అయితే ఈ పరిస్థితి చూసిన, పెనములూరు ఎమ్మెల్యే బోడేప్రసాద్, ఎవరో వస్తారని చూడకుండా, పరిస్థితిని కొంతవరకు అయినా అదుపు చేయాలని భావిస్తూ ఎమ్మెల్యే బోడేప్రసాద్ ఉయ్యూరులో స్వచ్ఛ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పార్టీ కార్యకర్తలు, నాయకుల తో కలిసి
ఉయ్యూరు మెయిన్ రోడ్ లో చెత్త తొలగించారు.
ఉయ్యూరు నగర పంచాయతీ పరిధిలో రెండు రోజులుగా స్వచ్ఛ సేవా కార్యక్రమం కొనసాగుతోంది. పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు, పట్టణ ప్రధాన రహదారులను శుభ్ర పరుస్తున్నారు. పారిశుధ్య కార్మికుల సమ్మె కొనసాగుతుండటంతో పట్టణాలలో రోజురోజుకి పరిశుభ్రత క్షీణిస్తోంది. చెత్తను తొలగించే ప్రక్రియలో భాగంగా, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గారు స్వయంగా ముందుండి చీపురు పట్టి రోడ్లు, సైడ్ డ్రైయిన్లు శుభ్రం చేస్తూ తమ పార్టీ శ్రేణులతోనూ పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు మాట్లాడుతూ కార్మికులు సమ్మె విరమించేందుకు ముందుకు వచ్చినా కొన్ని పార్టీల అనుబంధ ట్రేడ్ యూనియన్లు
వారిని అడ్డుకోవడం విచారకరమని అన్నారు.
కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచన చేస్తోందని, వారికి అన్ని విధాలా తగిన న్యాయం జరుగుతుందని తెలిపారు. అలాగే ప్రజారోగ్యం, పట్టణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కార్మికులు కూడా తమ బాధ్యతలు నిర్వర్తించాలని ఆయన కోరారు. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కొనసాగినంతకాలం పట్టణాన్ని స్వచ్చ సేవ కార్యక్రమంతో శుభ్రం చేసేందుకు తమవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గారు తెలిపారు. పరిసరాల పరిశుభ్రత స్థానిక సంస్థల బాధ్యతగా మాత్రమే కాకుండా ప్రజల కూడా స్వచ్ఛందంగా తమతమ ప్రాంతాన్ని శుభ్రపరచుకోవాలని సూచించారు. అది ఆరోగ్య సమాజానికి దోహద పడుతుందని అన్నారు.