ఐటీ అధికారుల వేధింపులకు ఓ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరులోని సనత్‌నగర్‌కు చెందిన సాధిక్ 25 ఏళ్లుగా విజయవాడలోని జవహర్ ఆటోనగర్‌లో లారీలకు బాడీ బిల్డింగ్ వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. జీఎస్టీ అమల్లోకి రాకముందు వరకు ఈ వృత్తి చేతి వృత్తుల్లో ఒకటి. ఇప్పుడు ఇక్కడ తయారయ్యే ప్రతీ వస్తువుపై జీఎస్టీ విధిస్తున్నారు. సాధిక్ కొద్దినెలలుగా ఐటీరిటర్న్స్ దాఖలు చేయకపోవడంతో ఆ శాఖ అధికారులు వచ్చి నోటీసులు ఇచ్చారు. దాంతో ఆయన ఓ చాటెడ్ అకౌంటెంట్‌ను ఆశ్రయించారు.
జీఎస్టీ నుంచి మినహాయింపు పొందేలా రిటర్న్స్ రూపొందించారు. బాడీ బిల్డింగ్ యూనిట్లో పనిచేస్తున్న ఐదారుగురు కార్మికులకు ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లు చూపించారు. ఐటీ అధికారులు ఈ ఐదుగురిని విచారించగా వారు కార్మికులే అని తేలింది. దీంతో సాధిక్‌కు ఐటీ అధికారులు రూ.50లక్షల జరిమానా విధించారు. ఐటీ అధికారులను వేడుకోగా రూ.15 లక్షలు ఇస్తే కేసు లేకుండా చేస్తామన్నారని సాధిక్ సహచరులకు చెప్పాడు. ఈ నేపథ్యంలో ఐటీ అధికారుల నుంచి ఫోన్లు ఎక్కువవడంతో సాధిక్ ఒత్తిడికి లోనయ్యాడు. ప్రార్థన మందిరానికి వెళుతున్నట్లు ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో చెప్పి బయలుదేరి తిరిగి రాలేదు.
ఆందోళనకు గురైన కుటుంబీకులు సోమవారం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి ఎనిమిదింటి ప్రాంతంలో ఆయన మృతదేహాన్ని కరువు కాల్వలో తోట్లవల్లూరు ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. సోమవారం రాత్రి తోట్లవల్లూరు కాల్వలో సాధిక్ మృతదేహం తేలింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మరోవైపు సాధిక్‌కు జీఎస్టీ నుంచి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని జీఎస్టీ ఉన్నతాధికారులు తెలిపారు. తమ జాబితాలో సాధిక్ పరిశ్రమలేదని, నోటీసులతో తమకు సంబంధం లేదని అధికారులు తేల్చిచెప్పారు. సాదిక్ ఆత్మహత్యకు ఆదాయ పన్ను శాఖ అధికారులే కారణమని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అధికారులు తమకూ కొంత డబ్బు ఇవ్వాలని సాదిక్‌ను డిమాండ్ చేసినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.