దేశంలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. చంద్రబాబు చొరవ తీసుకున్న దగ్గర నుంచి, దేశ రాజకీయాలు హీట్ ఎక్కాయి. ఆయన పని ఆయాన చూసుకుంటుంటే, చంద్రబాబుని టార్గెట్ చేసి మరీ, ఆయన్ను కెలికి మరీ, తన్నించుకుంటున్నారు. దీంతో చంద్రబాబు కూడా నేనంటే ఏంటో చూపిస్తాను అని చెప్పి మరీ శనివారం ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. మళ్ళీ రేపు గురువారంనాడు మరోసారి ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. ‘సేవ్ నేషన్’ పేరుతో భాజపాయేతర పార్టీలన్నింటనీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు గురువారం దిల్లీకి వెళ్తున్నారు. తన పర్యటనలో భాగంగా వివిధ పార్టీలకు చెందిన జాతీయ స్థాయి నేతలను చంద్రబాబు కలుసుకుంటారు.
జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఐక్య కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు కేవలం వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి న్యూఢిల్లీకి వెళ్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఈ పర్యటనలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోనూ భేటీ అయ్యే అవకాశం ఉంది. రేపు కూటమి పై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అన్ని వ్యవస్థలని నాశనం చేసిన మోడీ పై పోరాటం చెయ్యటంలో, అన్ని విపక్షాలు కలిసి రావట్లేదాని అభిప్రాయం ఉంది. కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలితో కొన్ని పార్టీలు దూరం అవుతున్నాయి. దీంతో చంద్రబాబు రంగంలోకి దిగి, అందరినీ ఒక తాటి పై తీసుకురానున్నారు. మరో పక్క, ఏపీకి అన్యాయం చేస్తున్న బీజేపీ తీరును ఎండగట్టాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేవారితో కలిసి వెళ్లేందుకు ఆ దిశగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తోంది.
ఈ రోజు మధ్యాహ్నం అమరావతిలోని సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులతో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేసిన చంద్రబాబు వారితో కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌తో భేటీ అంశం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. రేపటి దిల్లీ పర్యటనలో చంద్రబాబు రాహుల్‌ను కలిసే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. భాజపాయేతర కూటమి ఏర్పాటుపై వడివడిగా అడగులు వేయాలని చంద్రబాబు భావిస్తున్న నేపథ్యంలోనే ఆయన రాహుల్‌తో భేటీ కానున్నట్టు సమాచారం. ఈ పర్యటనలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా తదితరులతో భేటీ కానున్నారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల దృష్ట్యా ఈ భేటీ కీలకం కానుంది. అలాగే, భాజపాయేతర కూటమి ఏర్పాటుపైనా రేపు ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.