రఫేల్ ఒప్పందం పై రాజకీయ దుమారం రేగిన వేళ ఈ వ్యవహారానికి సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. రఫేల్ ఒప్పందానికి అయిన ఖర్చు, యుద్ధ విమానాల ధర తదితర పూర్తి వివరాలను 10 రోజుల్లోగా సీల్డ్ కవర్‌లో సమర్పించాలని కోర్ట్ చెప్పింది. ఈ ఒప్పందంలో ఆఫ్‌సెట్ భాగస్వాముల వివరాలు కూడా చెప్పాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. అయితే ఈ వివరాలను బహిర్గతం చేయలేమని కేంద్రం వెల్లడించిన నేపధ్యంలో, సుప్రీం ఆదేశాలతో కేంద్రానికి షాక్ తగిలింది. ‘ఒప్పందం విలువ, యుద్ధ విమానాల ధరకు సంబంధించిన వివరాలను సీల్డ్ కవర్‌లో సుప్రీంకోర్టుకు సమర్పించాలి. రానున్న 10 రోజుల్లో ఇది జరగాలి’ అని జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి సూచించింది.
కాగా యుద్ధ విమానాల ధరలను రహస్యంగా ఉంచాల్సినందున వీటిని వెల్లడించడం సాధ్యం కాదంటూ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాలన్ కోర్టుకు నివేదించారు. దీంతో రాఫెల్ ధరల వివరాలు రహస్యమనీ, వాటిని వెల్లడించడం కుదరదంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి కోర్టు సూచించింది. తాము సాంకేతిక వివరాలు వెల్లడించాలని కోరడం లేదనీ.. బహిర్గతం చేయకూడని కీలక సమాచారం ఏదైనా ఉంటే కేంద్రం గోప్యంగా ఉంచవచ్చునని వివరణ ఇచ్చింది. న్యాయవాదులు మనోహర్ లాల్ శర్మ, వినీత్ ధండా దాఖలు చేసిన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాల (పిల్)పై భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతోంది.
రఫేల్ ఒప్పందంలో భారీ కుంభకోణం దాగిఉందని గత కొన్ని రోజులుగా ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రఫేల్ ఒప్పందం కోసం అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్‌ను భారత ప్రభుత్వమే ప్రతిపాదించిందని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. రఫేల్ ఒప్పందం వివాదం తీవ్ర రూపం దాల్చడంతో దీనిపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం పైవిధంగా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు రాఫెల్ ఒప్పందంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ పిటిషనర్ ధర్మాసనాన్ని కోరారు. అయితే ప్రస్తుతం సీబీఐలోనే పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయనీ, అవన్నీ చక్కబడిన తర్వాత దీనిని పరిశీలించవచ్చునని కోర్టు పేర్కొంది.