ఎన్నికలు వచ్చాయంటే రకరకాల సర్వేలు వెలుగు చూస్తుంటాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేకు ఉండే డిమాండే వేరు. ఆయన చెప్పినవన్నీ ఇప్పటివరకూ జరుగుతూనే వచ్చాయి. అయితే తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో తన సర్వేను త్వరలో ప్రకటిస్తానన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. గతంలోనూ చంద్రబాబును కలిసిన రాజగోపాల్ మర్యాదపూర్వకంగానే కలిశానన్నారు. అయితే మళ్లీ ఇప్పుడు చంద్రబాబును ప్రశంసించడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. చంద్రబాబును ఆయన అనుభవం ఉన్న నేతగా అభివర్ణించారు. ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటారంటూ కితాబు ఇచ్చారు.
చంద్రబాబు అనుభవం ఉన్న నాయకుడని, ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటాడని కొనియాడారు. ఇటీవల అమరావతిలో ఆయన చంద్రబాబును కలిసిన విషయం తెలిసిందే. బాబును కలిసిన తర్వాత లగడపాటి మీడియాతో మాట్లాడుతూ... తాను మర్యాదపూర్వకంగానే కలిశానన్నారు. అలాగే తొలిసారి సచివాలయాన్ని సందర్శించానని చెప్పారు. హైదరాబాద్ సచివాలయం కన్నా.. అమరావతి సచివాలయం చాలా బాగుందని, తాత్కాలిక సచివాలయమే ఇంత అందంగా ఉంటే ఇక అసలు సచివాలయం వరల్డ్‌క్లాస్‌గా ఉంటుందని ఆయన పొగడ్తలు గుప్పించారు. సచివాలయాన్ని అందంగా తీర్చిదిద్దినందుకు చంద్రబాబును అభినందించానన్నారు. అయితే లగడపాటి టీడీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని ఆయన ఖండించిన విషయం తెలిసిందే.
మరో పక్క వైసీపీ అధినేత జగన్ పై ఇటీవల జరిగిన దాడిని లగడపాటి రాజగోపాల్ ఖండించారు. ఆ ఘటన దురదృష్టకరమని, సీఎం, ప్రతిపక్ష నేత.. ఇలా ఎవరిపైనా దాడులు మంచివి కాదని అన్నారు. మనది ప్రజాస్వామిక దేశమని, మార్పు తీసుకురావడానికి చాలా మార్గాలు ఉన్నాయని, దాడుల వల్ల ఎటువంటి మార్పు తీసుకురాలేమని అన్నారు. జగన్ పై దాడి ఘటనపై థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలని వైసీపీ నేతలు కోరుతున్నారని, దీనిపై ఆయన అభిప్రాయం కోరగా ఆయన బదులివ్వలేదు.