రేపు చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లాతో చంద్రబాబు సమావేశం అవుతారు. మధ్యాహ్నం వామపక్ష నేతలతో, సాయంత్రం అఖిలేష్ యాదవ్‌తో చంద్రబాబు భేటీకానున్నారు. 'సేవ్ నేషన్' పేరుతో బీజేపీకి ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో చంద్రబాబు కూటమి ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీకి అన్యాయం చేస్తున్న బీజేపీ తీరును ఎండగట్టాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ నేపధ్యంలో, రాహుల్ గాంధీతో భేటీ వార్తల పై చంద్రబాబు స్పందించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో మాట్లాడి అందరినీ ఒకతాటిపైకి తీసుకువస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అందరితో కలిసి జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ విధానాల వల్ల దేశం ప్రమాదంలో పడిందని, దేశాన్ని ప్రమాదం నుంచి బయటపడేసేందుకు తాను బాధ్యత తీసుకున్నానని, 40ఏళ్లుగా ప్రజాస్వామ్య విలువలు చూశానని చెప్పారు.
‘‘ప్రధాని మోదీ, అమిత్‌షా ఎన్ని దాడులు చేసినా భయపడేది లేదు. టీడీపీ దేశానికి ఎన్నోసార్లు దశదిశ చూపింది. ఇప్పుడు మరోసారి దేశరాజకీయాల్లో కీలకపాత్ర షోషించాల్సిన సమయం వచ్చింది. ఢిల్లీలో మనం యాక్టివ్ కావాలి. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకతాటిపైకి తీసుకు వస్తాం. రేపు ఢిల్లీలో రాహుల్‌తో మాట్లాడి అందరిని ఒకే వేదికపైకి తీసుకు వస్తా. నాకు ప్రధాని పదవిపై కోరికలేదు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. దేశ రాజకీయాల్లో అందరికంటే ముందున్న వ్యక్తిని నేను. ప్రధాని పదవి చేపట్టాలని 1995లోనే నాపై ఒత్తిడి వచ్చింది. రెండు సార్లు ప్రధాని పదవి చేపట్టే అవకాశం వచ్చినా తిరస్కరించాను’’ అని చంద్రబాబు చెప్పారు.