మొన్నటి మొన్న సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తులు, మీడియా ముందుకు వచ్చి ప్రధాన న్యాయమూర్తి వ్యవహార శైలి పై చేసిన విమర్శలు మరువక ముందే, ఇప్పుడు సిబిఐలో టాప్ బాస్‌లు ఒకరి పై ఒకరు విమర్శలు చేసి, అరెస్ట్ లు దాకా వెళ్లారు. సీబీఐలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. దేశంలోనే అవినీతి వ్యహరాలను దర్యాప్తు చేసే అత్యున్నత సంస్థ సీబీఐ అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడం, సీబీఐలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న అధికారులిద్దరూ ఒకరిపై ఒకరు 'ముడుపులు' తీసుకున్నారంటూ అవినీతి ఆరోపణలకు దిగడంతో కేసులు నమోదు వరకూ పరిస్థితి వెళ్లింది. సోమవారంనాడు వేగంగా మరికొన్ని పరిణామాలు చోటుచేసుకోవడంతో ప్రధాన మంత్రి కార్యాలయం తక్షణ చర్యలకు దిగింది. సీబీఐ చీఫ్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాలకు సమన్లు పంపింది.
మాంసం వ్యాపారి మెయిన్ ఖురేషికి సంబంధించిన కేసులో ఆయనకు ఉపశమనం కలిగించేందుకు మధ్యవర్తి మనోజ్ ప్రసాద్ ద్వారా లంచం తీసుకున్నాడన్న ఆరోపణలపై స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాపై సీబీఐ ఆదివారంనాడు లంచం కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఆస్థానాతో పాటు, అలోక్ వర్మకు పీఎంఓ సమన్లు పంపడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, సోమవారం ఉదయం సీబీఐ మరింత దూకుడుగా ముందుకు వెళ్లింది. ఆస్థానాపై ఉన్న లంచం ఆరోపణలకు సంబంధించి సిట్ సీబీఐ డిప్యూటీ ఎస్పీ దేవేంద్ర కుమార్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. మనీలాండరింగ్, అవినీతి ఆరోపణలతో సహా పలు కేసులు ఎదుర్కొంటున్న ఖురేషి కేసులో ఆస్థానాతో కలిసి కుమార్ పనిచేస్తున్నారు.
అయితే ఇదే కేసు విషయంలో, సియం రమేష్ ను కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారనే వార్తలు బయటకు రావటం, మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాసం ఉండటంతో, రాజకీయ దుమారానికి తెరలేపడంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ జోక్యం చేసుకోలేక తప్పలేదు. సీబీఐలో టాప్ 2 స్థానాల్లో ఉన్న డైరెక్టర్ అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాకు ప్రధాని మోదీ సమన్లు జారీ చేసినట్లు సమాచారం. ఆస్థానా కేసు వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రధాని మోదీపై విమర్శల వర్షం కురిపించింది. మోదీ నాయకత్వంలో రాజకీయ ప్రతీకారం తీర్చుకునేందుకు సీబీఐను ఆయుధంలా వాడుకున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు.