పోలవరం ప్రాజెక్ట్ ఇబ్బందుల్లో ఉండగా, అది అందుకున్న నవయుగ కంపెనీ, తరువాత పనులు ఎలా పరుగులు పెట్టించిందో అందరికీ తెలుసు. పోలవరం పనుల్లోనే కాదు, మన రాష్ట్రం ఇబ్బందుల్లో ఉండగా కూడా, నవయుగ ముందుకొచ్చింది. శ్రీకాకుళంలో వచ్చిన, తిత్లీ తుపాను బాధితులను ఆదుకునేందుకు నవయుగ కంపెనీ ఛైర్మన్ కె.విశ్వేశ్వరరావు రూ.కోటి విరాళాన్ని అందించారు. పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలించేందుకు సోమవారం పోలవరం వెళ్ళిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు విరాళానికి సంబంధించిన చెక్కును ఆయన అందజేశారు. తీవ్ర తుఫాను వల్ల అల్లాడిన శ్రీకాకుళం ప్రజలకు, ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు, తమ వంతుగా ఈ సహాయం చేస్తున్నట్టు చెప్పారు.
మరో పక్క, ప్రాజెక్టును సోమవారం 28వసారి ఆయన సందర్శించారు. మధ్యాహ్నం రెండింటికి హెలికాప్టర్లో ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ఆయన హిల్వ్యూ కొండపై నుంచి పనులను పరిశీలించారు. అనంతరం స్పిల్వేలో 26వ బ్లాకు పనులను చూశారు. ఆ తరువాత త్వరలో ప్రారంభించబోయే ఎగువ కాపర్డ్యాం ప్రాంతం వద్దకు వెళ్లారు. అక్కడ విలేకరులతో మాట్లాడారు. పోలవరం నిర్మాణాన్ని సవాలుగా తీసుకున్నామని, ఏదిఏమైనా వచ్చే ఏడాది మే నాటికి పూర్తి చేయాలనేదే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ ఏడు నెలలే కీలకమని.. ఎగువ, దిగువ కాపర్డ్యామ్లు పూర్తి చేస్తే ప్రాజెక్టునుంచి నీళ్లివ్వగలమని తెలిపారు.
‘డిసెంబరులో గేట్ల పనులను ప్రారంభిస్తాం. మే 15, 20 తేదీలనాటికి పూర్తి చేస్తాం. స్పిల్ఛానల్, స్పిల్వే పూర్తి చేసి కుడి, ఎడమకాల్వలకు నీళ్లందిస్తాం. ఇది పూర్తి చేయగలిగితే అటు విశాఖ, ఇటు కృష్ణా జిల్లాలు సస్యశ్యామలం కావడంతోపాటు అన్ని జిల్లాలకు లాభం చేకూరుతుంది. వంశధార నుంచి పెన్నా వరకు అన్ని నదులనూ అనుసంధానించి నీరు ఎక్కువ, తక్కువలను సరిచేసుకునే వెసులుబాటు ఉంటుంది’ అని సీఎం వివరించారు. ‘ఇప్పటివరకు ప్రాజెక్టుకు రూ.15,013 కోట్లు ఖర్చయ్యింది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక రూ.9,877 కోట్లు వెచ్చించగా, కేంద్రం నుంచి రూ.6,720 కోట్లు వచ్చాయి. ఇంకా రూ.3150 కోట్లు రావాల్సి ఉంది. వైకుంఠపురం వద్ద పది టీఎంసీల నిల్వ సామర్థ్యంతో మరో బ్యారేజీకి శ్రీకారం చుట్టాం. మొదటిదశలో నాగార్జునసాగర్ కుడి ప్రధానకాల్వకు నీరిస్తాం. రెండో దశలో సోమశిలకు, మూడో దశలో బొల్లపల్లికి నీరిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా 61 ప్రాజెక్టులు నిర్మిస్తుండగా 18 ఇప్పటికే పూర్తి చేశాం. మరో ఏడు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. 20 వివిధ దశల్లో ఉన్నాయి. 16 టెండర్ల దశలో ఉన్నాయి. వీటిని వేగవంతం చేస్తాం’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.