మన రాష్ట్రంలో విశాఖ నగరానికి హూద్ హూద్ తుఫాను వచ్చి విధ్వంసం చేస్తే, ప్రధాని మోడీ వచ్చి, తక్షణ సాయం కింద వెయ్య కోట్లు ప్రకటించారు. తక్షణ సాయమే ఇంత ఇచ్చారంటే, ఇక పూర్తి స్థాయి సాయం, దీనికి పది రెట్లు ఉంటుందని అందరూ అనుకున్నారు. కట్ చేస్తే, ఇస్తానన్న వెయ్య కోట్లు కూడా ఇవ్వకుండా, 600 కోట్లు ఇచ్చి పండగ చేసుకోమన్నారు. ఇప్పుడు శ్రీకాకుళం తుఫానుకైతే పైసా కూడా ఇవ్వకుండా, కనీసం ఒక సానుభూతి ప్రకటన కూడా చెయ్యలేదు. మన బాదలు ఇలా ఉంటే, ఇటీవల వరదలు వచ్చి నాసనమైన కేరళ రాష్ట్రం కూడా, మోడీ మాయ మాటలకు ఇబ్బంది పడుతుంది. స్వయంగా ఆ రాష్ట్ర సియం, మోడీ పై విమర్శలు గుప్పించారు. చేస్తానన్న సాయం చెయ్యకుండా, వేరే వాళ్ళు చెయ్యనివ్వకుండా, మోడీ అడ్డుపడుతున్నారని విమర్శలు గుప్పించారు.
తమ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవట్లేదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శించారు. తమ రాష్ట్రంపై వివక్ష చూపుతున్నారని ఆయన ఆరోపించారు. ఆ రాష్ట్రంలోని వరద బాధిత ప్రాంతాల్లో పునరావాస చర్యలు చేపట్టేందుకు ప్రవాస భారతీయుల నుంచి విరాళాలు సేకరించే నిమిత్తం ఆ రాష్ట్ర మంత్రులు 17 దేశాల్లో పర్యటించాలని నిర్ణయించుకోగా వారి పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వని విషయం తెలిసిందే. అంతకు ముందు యూఏఈ అందిస్తామన్న సాయాన్ని కూడా వద్దని చెప్పింది. ఈ విషయాలను తన ఫేస్బుక్ ఖాతాలో ప్రస్తావిస్తూ మోదీని పినరయి విజయన్ విమర్శించారు.
‘నేను మోదీని కలిసిన సమయంలో.. మా రాష్ట్ర మంత్రులు విదేశాలకు వెళ్లడానికి ఆయన అంగీకరించారు. కానీ, చివరి నిమిషంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ అందుకు అనుమతిని నిరాకరించింది. అన్ని విషయాల్లోనూ సాయం చేస్తామని మోదీ మాట ఇచ్చినప్పటికీ మా మంత్రులు విదేశాలకు వెళ్లడానికి ఎందుకు అనుమతి ఇవ్వట్లేరో నాకు అర్థం కావట్లేదు. మాకు ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకోవట్లేదు. యూఏఈతో పాటు చాలా దేశాలు పెద్ద ఎత్తున సాయం చేస్తామని ముందుకు వచ్చాయి. కానీ, వారి సాయాన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. రాష్ట్ర పునర్నిర్మాణంలో మేము విఫలం కావాలని అనుకోవట్లేదు. మేము మా రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సి ఉంది. దీన్ని ఎవరూ అడ్డుకోలేరు. మళయాలీ ప్రజలే మా బలం. వారిపై మాకు పూర్తి నమ్మకం ఉంది. కేరళను బాగు చేసుకోవడానికి అందరూ సహకరించాలని కోరుతున్నాను’ అని ఆయన పేర్కొన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్న సమయంలో ఆ రాష్ట్రంలోని భుజ్‌లో భారీ భూకంపం వచ్చిందని, దీంతో ఆయన విదేశాలకు వెళ్లి గుజరాత్ కమ్యూనిటీ సాయాన్ని కోరారని, ఇప్పుడు తాము అదే పని చేయాలనుకుంటే కేరళపై వివక్ష చూపుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.