బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు టీడీపీ ఎంపీ సీఎం రమేష్... వంద కోట్లు అక్రమాలకు పాల్పడ్డానని చెబుతున్నారు కదా! ఒక్కటి నిరూపించు చూద్దాం అంటూ సవాల్ చేశారాయన. ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఒక్క బిజినెస్‌లో అయినా డీల్ కుదిరిందేమో చూపించాలన్న ఆయన... సత్యమూర్తి ఐటీ కంపెనీల్లో డీల్ కుదిరిందా? ఆధారాలతో రా...! ఏంటీ ఏపీలో టీడీపీ పని అయిపోయిందంటావా! ఒక్క చోట కౌన్సిలర్ గా అయినా గెలిచే సత్తా మీ బీజేపీకి ఉందా? అంటూ మండిపడ్డారు. ఆంధ్రలో బీజేపీ, జగన్... ఇంకా ఎవరొచ్చినా వాళ్ల ఆటలు సాగవన్న సీఎం రమేష్... రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి చీకటి వ్యాపారాన్ని తలపిస్తోందని... జగన్, బీజేపీ ఇరువురిని ఏపీలో అంటరానివారుగా చూస్తున్నారని సెటైర్లు వేశారు.
లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వాలంటే జీవీఎల్‌ను, పవన్ కల్యాణ్‌ను అడగాలా? అంటూ ప్రశ్నించారు సీఎం రమేష్... బీజేపీ ప్రభుత్వమే లోకేష్ బాబుకు బెస్ట్ అవార్డు ఇచ్చిందని గుర్తు చేసిన ఆయన... ప్రజల మన్నన పొందారనడానికి ఈ అర్హత చాలదా? అంటూ ప్రశ్నించారు. మీరు ముఖ్యమంత్రి చంద్రబాబుని, మంత్రి లోకేష్‌ను నిందించడం అంటే... మీరు అభాసుపాలు కావడమే నన్న సీఎం రమేష్... నా పైన ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేస్తున్నానంటున్నావు కదా.. నాతో పాటు అమిత్ షాపై కూడా సుప్రీం కోర్టు జడ్జితో విచారణ జరిపించండి... వాస్తవాలు ఏమిటో తేలిపోతాయని సవాల్ చేశారు.
మరో పక్క, జీవీఎల్ నర్సింహారావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర... అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన... జీవీఎల్ ఒక తోకలేని కోతి అంటూ వ్యాఖ్యానించారు. ఏపీకి అన్యాయం జరిగితే ప్రజలే రాళ్లతో కొడతారని హెచ్చరించిన ఆయన... బీజేపీని నిలదీసిన ప్రతీ టీడీపీ నేతపై ఐటీ, ఈడీ తో దాడులు చేయిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇక కనీవినీ ఎరుగని రీతిలో తుఫాన్ విరుచుకుపడితే స్పందించాల్సిన కేంద్రం మౌనంగా ఉందని విమర్శించిన కొల్లు రవీంద్ర... విపత్తులో చెయ్యి అందించాల్సిన కేంద్రం మొండి చెయ్యి చూపిందని... పక్క జిలాల్లో పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత పరామర్శకు కూడా రాని పరిస్థితి ఉందన్నారు.