తిత్లీ తుఫాన్ స‌ర్వం తుడిచిపెట్టుకుపోయింది. ప్ర‌భావిత ప్రాంతాల‌న్నీ అస్త‌వ్య‌స్త‌మ‌య్యాయి. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు హుటాహుటిన శ్రీకాకుళం జిల్లా బాధిత ప్రాంతాల‌కు చేరుకున్నారు. మొత్తం ప్ర‌భుత్వ యంత్రాంగ‌మూ, మంత్రులూ బాధితుల‌కు స‌హాయ‌కార్య‌క్ర‌మాలు అందించే ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌య్యారు. ఇది వారం రోజుల క్రితం సంగ‌తి. అంద‌రితోపాటు త‌న శాఖ‌ల ప‌రిధిలో జ‌రిగిన న‌ష్టం, స‌హాయ‌క‌చ‌ర్య‌ల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి మంత్రి లోకేష్ కూడా వెళ్లారు. యువ‌మంత్రి నారా లోకేష్ ప్ర‌ణాళిక‌, ప‌ట్టుద‌ల‌, చొర‌వ చూసిన ముఖ్య‌మంత్రి మంద‌స మండ‌లం స‌హాయ‌క‌చ‌ర్య‌ల ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఇది జ‌రిగి వారం రోజులైంది. అప్పుడు మంద‌స మండ‌లం మొత్తం తిత్లీ కోర‌ల‌కు చిక్కి విల‌విల్లాడుతోంది. ఓ వైపు స‌ర్వం కోల్పోయిన బాధితుల‌కు మేమున్నామంటూ భ‌రోసా ఇస్తూనే.. మ‌రోవైపు చ‌క్క‌నైన ప్ర‌ణాళిక‌తో మంద‌స మండ‌లంలో ప‌రిస్థితిని పూర్తిగా గాడిలో పెట్టిన ఘ‌న‌త మాత్రం మంత్రి నారా లోకేష్‌దే. వారం రోజుల్లో ఒక్క ప్రెస్ మీట్ లేదు. విలేక‌రుల‌తో మాట్లాడింది లేదు. చీక‌టి ప‌డేవ‌ర‌కూ తుఫాన్ పీడిత ప్రాంతాల‌కు అందుతున్న సాయం, బాధితుల ఆవేద‌న విన‌డం, స‌హాయ‌క‌చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షించ‌డం, చీక‌టి ప‌డ్డాక‌..అందుబాటులో ఉన్న ఏదో ఒక ప్ర‌భుత్వ కార్యాల‌యానికి చేరుకుని త‌రువాత చేయాల్సిన‌వి, స‌హాయ‌క‌చ‌ర్య‌ల ప్ర‌గ‌తి, బాధితులు చెప్పిన‌వి పునఃస‌మీక్షించుకుని ప్ర‌ణాళిక సిద్ధం చేయ‌డం ఇదీ వారం రోజులుగా మంత్రి త‌న దిన‌చ‌ర్య‌గా మార్చుకున్నారు.

ముఖ్య‌మంత్రి మంద‌స మండ‌లం స‌హాయ‌చ‌ర్య‌ల ప‌ర్య‌వేక్ష‌ణ ఇన్‌చార్జిగా త‌న‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించిన నుంచీ మండ‌లం మొత్తం ప‌రిస్థితి అంతా చ‌క్క‌బ‌డే వ‌ర‌కూ అక్క‌డే ఉండాల‌ని మంత్రి లోకేష్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక్క‌డే తాత్కాలికంగా ఓ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మందస మండలంలోని 38 పంచాయతీలు,244 నివాస ప్రాంతాల్లో జరిగిన తుఫాన్ న‌ష్టంపై నివేదిక తెప్పించుకున్నారు. ఈ ప్రాంతాల భౌగోళిక ప‌రిస్థితిపై ఒక అవ‌గాహ‌న‌కు వ‌చ్చారు. బాధితుల‌కు స‌త్వ‌రం అవ‌స‌ర‌మైన‌వేంటో తెలుసుకున్నారు. ఇదంతా ఒక్క స‌మీక్ష స‌మావేశంలోనే జ‌రిగిపోయింది. వెనువెంట‌నే కార్య‌రంగంలోకి దిగారు. తుఫాన్ బీభ‌త్సంతో క‌రెంటు లేక‌, నీటి స‌ర‌ఫ‌రా కాక‌, వండుకునే ప‌రిస్థితులు లేక‌పోవ‌డంతో బాథితులకు స‌త్వ‌రం ఆక‌లి తీర్చ‌డం, తాగునీరందించ‌డాన్ని ప్రాధాన్యంగా ఎంచుకున్నారు. మంద‌స మండ‌లం మొత్తం నీటిప‌థ‌కాల‌న్నీ క‌రెంట్ లేక నిలిచిపోయాయి. దీంతో వివిధ ప్రాంతాల నుంచి తెప్పించిన‌ 60 జనరేటర్లు వినియోగించి నీటి ప‌థ‌కాల‌ను న‌డిపించారు. ఇవీ లేని చోట ట్యాంక‌ర్లతో నీటిని స‌ర‌ఫ‌రా చేశారు. ట్యాంక‌ర్లూ చేర‌ని చోట్ల‌కు వాట‌ర్ ప్యాకెట్లు పంపించారు.

ప్ర‌ధాన‌మైన నీటి ప‌థ‌కం ఉద్దానం హెడ్ పంపింగ్ వర్క్స్ పూర్తి స్థాయిలో పనిచేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో చాలావ‌ర‌కూ తాగునీటి స‌మ‌స్య ప‌రిష్కార‌మైంది. మందస మండలంలో ఉన్న 156 స్కూల్స్ ,అంగన్వాడీ కేంద్రాల్లో ప్ర‌జ‌ల‌కు మూడు పూటలా భోజనం ఏర్పాటు చేయించారు. ఇళ్లు కోల్పోయిన వారికి పూర్తి స్థాయి సహాయం అందే లోపు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి..టార్పాన్లు, దుప్ప‌ట్లు ఇవ్వాల‌ని సూచించారు. మ‌రోవైపు రేష‌న్ షాపుల ద్వారా ఒక్కొక్క‌రికీ 25 కేజీల బియ్యం, నిత్యావ‌స‌ర స‌రుకులు, కూర‌గాయ‌లు స‌ర‌ఫ‌రా చేశారు. ఇవ‌న్నీ బాధితుల‌కు అందుతున్నాయా? లేదా అనేది ప‌రిశీలించేందుకు మంత్రి నారా లోకేష్‌ ఆక‌స్మిక‌త‌నిఖీలు చేప‌ట్టారు. తుఫాన్ పీడిత ప్రాంతీయుల‌తో మాట్లాడి...వారి అవ‌స‌రాల మేర‌కు వ్య‌వ‌స్థ‌లు ప‌నిచేసేలా ఆదేశాలు ఇచ్చారు. అన్ని స్తంభాలు నేల‌కొరిగిన చోట‌... మంద‌స మండ‌లంలో తుఫాన్ ధాటికి 3 వేల స్తంభాలు నేల‌కొరిగాయి. మొద‌టి స్తంభం నుంచి చివ‌రి స్తంభం వ‌ర‌కూ కొత్త‌గా వేయాల్సిందే. విద్యుత్ పున‌రుద్ధ‌ర‌ణ జ‌రిగితే చాలా స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయ‌ని భావించిన మంత్రి నారా లోకేష్‌.. దీనిపై దృష్టి సారించారు. పూర్తిగా దెబ్బతిన్న 3 వేల విద్యుత్ స్తంభాలు స్థానంలో కొత్త స్తంభాల ఏర్పాటును వేగ‌వంతం చేశారు. 60 మంది అధికారులు, 530 మంది సిబ్బంది, 30 క్రేనులు, అదనపు సిబ్బంది రాత్రింబ‌వ‌ళ్లూ ప‌నిచేసి చాలా వ‌ర‌కూ విద్యుత్ వ్య‌వ‌స్థ‌ను పున‌రుద్ధ‌రించారు.

కొబ్బరి చెట్లు, జీడి, మామిడి చెట్లు పూర్తిగా నేలమట్టం కావ‌డంతో ఉద్యాన‌వ‌న రైతుల్ని ఆదుకునే బాధ్య‌త ప్ర‌భుత్వ‌మే తీసుకోవాల‌ని మంత్రి లోకేష్ భావించారు. ముందుగా ఎక్క‌డిక‌క్క‌డ ప‌డిపోయిన చెట్ల‌ను తొల‌గించేందుకు ఉపాధి హామీ ప‌థ‌కం అనుసంధానంతో నిధులు వినియోగించేందుకు అవ‌కాశం క‌ల్పించారు. రైతులు యంత్రాల‌ను వినియోగించుకుని విరిగిన‌, ప‌డిపోయిన చెట్ల‌ను తొల‌గించుకునే వెసులుబాటు ఇచ్చారు. ఉద్దానం రైతులు నిలదొక్కుకునేలా త్వ‌ర‌గా పంట అందికొచ్చే హైబ్రిడ్‌ కొబ్బరి మొక్కలు ఇవ్వడంతో పాటు 3 ఏళ్ల పాటు నిర్వహణ ఖర్చులు కూడా ఉపాధిహామీ ప‌థ‌కం అనుసంధానం కింద ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. అన్నివిధాలా ఆదుకుంటూ.. ఊర్ల‌కు నీరందుతోంది. ఆహారం స‌ర‌ఫ‌రా అవుతోంది. రేష‌న్ పంపిణీ జ‌రిగింది. విద్యుత్ పున‌రుద్ధ‌ర‌ణ అయ్యింది. అయితే తిత్లీతో అధ్వానంగా మారిన పారిశుధ్య వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్టేందుకు ప్ర‌త్యేక బృందాల‌ను రంగంలోకి దింపారు. గ్రామాల్లో అంటు వ్యాధులు ప్ర‌బ‌ల‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, గ్రామాల్లో చెత్త కుప్పల తొలగింపు, మురుగు కాలువల పూడికతీత, బ్లీచింగ్ చ‌ల్ల‌డం వంటి కార్య‌క్ర‌మాల‌ను తానే ప‌ర్య‌వేక్షించారు. తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న 116 కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్లు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న‌ మరమ్మతులు చెయ్యాల‌ని సంబంధిత‌శాఖాధికారులకు మంత్రి ఆదేశించారు. రోడ్ల మ‌ర‌మ్మ‌తుల ప‌నుల‌ను మంత్రి నేరుగా వెళ్లి ప‌రిశీలించారు. చాలా ర‌హ‌దారులు మ‌ర‌మ్మ‌తులు పూర్త‌య్యాయి.

ఆదుకోవాల్సింది మేమే కాదు..మ‌నంద‌రం.. `` చలించే ప్రతి హృదయానికి.. `` అని త‌న లేఖ‌ను ప్రారంభించి..తిత్లీ భీభ‌త్సం..న‌ష్టాన్ని వివ‌రిస్తూ ..బాధితుల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వం ఒక్క‌టే కాదు.. తెలుగువారంద‌రూ ముందుకు రావాల‌ని మంత్రి నారా లోకేష్ లేఖ రాశారు. ఈ ఆపద సమయంలో శ్రీకాకుళం ప్రజలకు సహకారం అందించాల‌ని కోరారు. సీఎం సహాయనిధికి విరాళాల రూపంలో అందించాల‌ని, స్మార్ట్ విలేజ్ కార్యక్రమం కింద దెబ్బతిన్న గ్రామాలను ద‌త్త‌త తీసుకోవ‌చ్చ‌ని, నేరుగా బాధితుల‌కు అవ‌స‌ర‌మైన స‌హాయం అందించాల‌ని పిలుపునిచ్చారు. మంత్రి నారా లోకేష్ పిలుపున‌కు స్పందించి చాలా మంది తిత్లీ తుపాన్ స‌హాయం కార్య‌క్ర‌మాల‌కు నేరుగా వ‌చ్చి సాయం అందించారు. మ‌రికొంద‌రు సీఎం స‌హాయ‌నిధికి విరాళాలు ఇచ్చారు. జియో వైఫై, ఐటీసీ, సీఐఐ, అమ‌రాన్ బ్యాట‌రీస్‌, ఐటీసీ, శ్రీమిత్రా గ్రూప్, సిఆర్ఎస్ స్వ‌చ్ఛంద సంస్థ‌ వంటి చాలా సంస్థ‌లు తుఫాన్ బాధితుల‌కు స‌హాయం అందించించాయి.

ఆప‌న్నుల‌ను ఆదుకోవ‌డం కంటే పండ‌గ ఉందా? తిత్లీ తుఫానుతో స‌ర్వం కోల్పోయిన బాధితుల‌ను ఆదుకోవ‌డంలో ఉన్న ఆనందం కంటే ఇంకేం పండ‌గ ఉంటుంది? అందుకే ద‌స‌రా స‌ర‌దాల‌కు దూరంగా మంద‌స ప్రాంతంలోనే బాధితుల మ‌ధ్య ..స‌హాయ‌క‌చ‌ర్య‌ల యంత్రాంగం మ‌ధ్య‌లోనే మంత్రి నారా లోకేష్ త‌న పండ‌గ‌ను పూర్తి చేసుకున్నారు. త‌న‌ను వ‌రించిన అత్యున్నత పురస్కారం వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ను అందుకునేందుకు మంత్రి నారా లోకేష్ ఈ నెల 17న అమెరికా వెళ్లాల్సి ఉంది. అయితే స‌హాయ‌క‌చ‌ర్య‌ల‌కూ ఏ ఒక్క‌టీ ఆటంకం కాకూడ‌దు..సాధార‌ణ‌స్థితికి తుఫాన్ బాధిత ప్రాంతాల‌ను తీసుకొచ్చే ప్ర‌ణాళిక పూర్త‌య్యే వ‌ర‌కూ అక్క‌డే ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న మంత్రి లోకేష్‌.. అమెరికా ప‌ర్య‌ట‌నను ర‌ద్దు చేసుకున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read