అగ్రిగోల్డ్ యాజమాన్యంతో ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ కుమ్మక్కు అయ్యారని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు కుటుంబరావు ఆరోపించారు. యాజమాన్యానికి సన్నిహితంగా ఉండే ఏజెంట్లతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారని అమరావతిలో విమర్శించారు. అగ్రిగోల్డ్ ఆస్తులు వేలం జరగకుండా అడ్డుకోవడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని పేర్కొన్నారు. స్కాం రూ.6400 కోట్ల వరకు పెరగడానికి కన్నా కూడా కారణమే అని ఆరోపించారు. హ్యాయ్ ల్యాండ్ విలువ రూ. 3వేల కోట్లు అని చెబుతున్న.... ఆయన వేయికోట్ల రూపాయలతో హ్యాయ్ ల్యాండ్ ను సొంతం చేసుకోవచ్చు అని సవాల్ విసిరారు. చంద్రబాబు కుటుంబం తరహాలో కన్నా ఆస్తులు ప్రకటించగలరా అని ప్రశ్నించారు.
జీవీఎల్ పై చర్యలు తీసుకోవాలని రాజ్యసభ ఛైర్మన్ కు లేఖ రాస్తున్నానని తెలిపారు. జీవీఎల్ నరసింహరావు చేస్తున్న ఆరోపణలపై కోర్టుకువెళ్లొచ్చ కదా అని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా రఫేల్ స్కామ్ మార్మోగుతోంది... మరి అమిత్ షా, రఫేల్ స్కామ్ పై విచారణ ఎందుకు చేయించుకోరని కుటుంబరావు ప్రశ్నించారు. జీవీఎల్ నరసింహరావు, కేంద్రానికి లేఖ రాసి, రఫేల్ స్కామ్ విచారణ జరపమని కోరాలి అని అన్నారు. దేశ ప్రజలంతా ఇప్పుడు స్కామ్(SCAM) కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. SCAM అంటే "సేవ్ కంట్రీ ఫ్రమ్ అమిత్ షా అండ్ మోడీ" అని కుటుంబరావు విశ్లేషించారు.
మరో పక్క బుద్ధా వెంకన్న కూడా బీజేపీ పై మండి పడ్డారు. అడ్రస్ లేని బీజేపీకి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అని, చంద్రబాబు గురించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న కన్నా... నూజివీడులో ఉన్న దేవదాయశాఖకు చెందిన భూములు, గుంటూరులోని పలు ప్రాంతాలలో విలువైన భూములను కబ్జా చేశారని ఆరోపించారు. జగన్, కన్నాలకు ఒకే స్థాయిలో అవినీతి చరిత్ర ఉంటుందన్నారు. చంద్రబాబు బినామీలంటూ టీడీపీ నేతలపై విమర్శలు చేయడమే జీవీఎల్ పని అని బుద్దా విమర్శించారు. జీవీఎల్ పవర్ బ్రోకర్ అని, ఆయనకు ఎంపీ పదవి ఇచ్చి ఏపీపైకి మోదీ వదిలారని అన్నారు.