ఉద్యోగాల కల్పనలో విజన్ 2029 లక్ష్యాన్ని చేరుకోవడంలో భాగంగా ‘ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయిమెంట్ మిషన్’ (ఎ.పి.ఇ.ఎం.) పేరుతో ఒక ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టడానికి ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. రాష్ట్ర యువతకు మరిన్ని ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. పరిశ్రమలు, పర్యాటక, యువజన వ్యవహారాల శాఖలతో పాటు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ, పేదరిక నిర్మూలన సంస్థలను భాగస్వామ్యం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయిమెంట్ మిషన్ ప్రారంభిస్తారు. యువజన వ్యవహారాల శాఖలో పనిచేస్తున్న యువ ఐఎఎస్ అధికారి భానుప్రకాశ్‌ను సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. శుక్రవారం సాయంత్రం ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో తన జరిగిన సమావేశంలో దీనికి సంబంధించి కొన్ని ఆదేశాలు జారీచేశారు.

youth 2010208

మల్టీనేషనల్ ప్రొఫెషనల్ సర్విసెస్ నెట్‌వర్క్ సంస్థ ‘ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్’ (పి.డబ్లు.సి.) ప్రతినిధులు ఇచ్చిన ప్రెజెంటేషన్ పరిశీలించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో పెద్దఎత్తున ఉద్యోగాల పెంపునకు ‘మహారాష్ట్ర ఎంప్లాయిమెంట్ మిషన్’ తరహాలో ఈ ప్రాజెక్టును అమలు చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మూడు దశలలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును తొలిదశలో కడప, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాలలో చేపడతారు. రాష్ట్రంలో పరిశ్రమలను నెలకొల్పేందుకు ఇప్పటికే అవగాహన ఒప్పందాలు చేసుకున్న సంస్థలు, వ్యవసాయాధారిత యూనిట్లు, ఆక్వాకల్చర్, సెరికల్చర్, మైనింగ్, ట్రైబల్ ఆర్ట్-హస్తకళలు, మహిళా స్వయం సహాయక సంఘాలను సమీకృతం చేస్తూ వ్యూహాత్మక కార్య ప్రణాళికను అమలు చేయడం ద్వారా ఉద్యోగాలను పెంపు లక్ష్యాన్ని సాధిస్తారు.

youth 2010208

ఏపీలో ఉండే ప్రత్యేక వనరులు (వ్యవసాయం), ప్రత్యేక లక్షణాలు (పర్యాటకం), ప్రత్యేక నైపుణ్యాలు (హస్తకళలు) ఉపయోగించుకోవడం ద్వారా ఉద్యోగాల పెంపు లక్ష్యాన్ని సులభంగా సాధించవచ్చునని పి.డబ్లు.సి. ప్రతినిధులు ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి వివరించారు. ప్రతి జిల్లాలో చిన్న, మధ్య తరహా, మెగా పరిశ్రమల ఏర్పాటుతో రాష్ట్రంలో సమగ్ర పారిశ్రామికాభివృద్ధి జరగాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక్కొక్కటి చొప్పున కనీసం 100, 200 ఎకరాల విస్తీర్ణంలో ఎంప్లాయిమెంట్ జోన్లు ఏర్పాటు చేయాలన్నదే తన ఆలోచనగా చెప్పారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటును అందించడం, అవసరమైన మౌలిక సదుపాయలను కల్పించడంతో పాటు, ఇప్పటికే ఉన్న పరిశ్రమలకు తగిన గ్లోబల్, లోకల్, నేషనల్ స్థాయిలలో మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం అవసరమని చెప్పారు. సాంకేతికంగా, నైపుణ్యపరంగా ఉన్న లోపాలను కూడా మెరుగుపరచుకోవాల్సివుంటుందని అన్నారు. తిరుపతి-చెన్నయ్-నెల్లూరులను కలుపుతూ త్రికోణ ప్రాంత ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ నగరాన్ని (ఫస్ట్ సిటీ) ఏర్పాటు చేస్తున్నామని, దీంతో పాటు చెన్నయ్-విశాఖ, బెంగళూరు-చెన్నయ్ పారిశ్రామిక ప్రాంతాలు, నోడ్లు, క్లష్టర్ల ఏర్పాటుతో ఏపీలో సానుకూల పారిశ్రామిక వాతావరణాన్ని నెలకొల్పామని వివరించారు. ప్రకాశం జిల్లాలో రామాయపట్నం ఓడరేవును అభివృద్ధి చేస్తున్నామని, ఆ ప్రాంతం కూడా రానున్న కాలంలో ఉద్యోగ-ఉపాధికి ముఖ్య కేంద్రంగా మారగలదని చెప్పారు. వచ్చే నెలలో ఈ ప్రాజెక్టును ప్రారంభించేలా చూడాలని ముఖ్యమంత్రి పి.డబ్లు.సి. ప్రతినిధులకు సూచించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read