ఎప్పుడూ స్లో గేర్ లో ఉండే చంద్రబాబు, ఇప్పుడు టాప్ గేర్ లో ఉన్నారు. ఒక పక్క జాతీయ స్థాయిలో మోడీ, షా లకు చుక్కలు చూపిస్తూనే, రాష్ట్రంలో కోడి కత్తి పార్టీ, కోతి మూక పార్టీకి చెక్ పెడుతున్నారు. వీళ్ళనే కాదు, సొంత పార్టీ నేతలను కూడా చంద్రబాబు ఒక రేంజ్ లో ఏసుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో ఆయన రెండు రోజుల పర్యటన శనివారం ముగిసింది. సాయంత్రం వరకూ పార్టీ సమీక్షలు జరిపారు. తెదేపా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. అంతకుముందు శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలవరకూ పార్టీ నేతలతో మాట్లాడారు. పనితీరు సరిగా లేని నాయకులను మందలించారు.
ఐక్యంగా పనిచేయాలని, పక్క నియోజకవర్గాలనూ పట్టించుకోవాలని హితవు పలికారు. కొందరు నాయకుల పేరు చెప్పకుండానే పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. లేకుంటే వారిని మార్చేస్తానని స్పష్టం చేశారు. నాయకుల పనితీరు మొత్తం నాకు తెలుసు. ఎవరిని ఏ స్థానంలో ఉంచాలో అక్కడ ఉంచుతా అని అన్నారు. జిల్లాను పట్టించుకోవడం లేదంటూ మంత్రులకు చురకలంటించారు. ‘మంత్రి శిద్దా రాఘవరావు తన వర్గానికి ప్రాధాన్యమిస్తారు. ఇన్‌ఛార్జి మంత్రి నారాయణకు మొహమాటం ఎక్కువ.. ఈ ఇద్దరూ సీరియస్‌గా తీసుకోని కారణంగా జిల్లాలో విభేదాలు పెరుగుతున్నాయి’ అని అధినేత వ్యాఖ్యానించారు.
మార్కాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందుల నారాయణరెడ్డిని మందలించారు. ‘మీకు చాలాసార్లు చెప్పా, మారడం లేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపి నియోజకవర్గ సమీక్ష సందర్భంగా అక్కడి ఎమ్మెల్యే స్వామి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌లను మందలించారు. ‘ఒకసారి ఎమ్మెల్యే అయినంత మాత్రాన మహా నాయకులు అయిపోతున్నారా? ప్రధాని అయిన తర్వాత మోదీకి అహం పెరిగిందని స్పష్టమవుతోంది. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. అందరినీ ఒకేలా చూడాలి. అహం చేరకూడదు. నేను ఒక్క ప్రకటన చేస్తే మీరు కింద కార్యకర్తల పక్కన కూర్చుంటారు’ అని హెచ్చరించారు. ఇకనైనా మారాలని, లేకుంటే తానే మారుస్తానని చంద్రబాబు హెచ్చరించారు.