రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉందని, త్వరలోనే ఆర్ధిక ఎమర్జెన్సీ విధించే అవకాసం ఉందని, రాష్ట్ర పరిస్థితి చూస్తే అలాగే ఉందని, ఆర్టికల్ 360 కింద ఆర్ధిక అత్యవసర పరిస్థితి విధించే అవకాశాలు ఉన్నాయి అంటూ, మాజీ ఆర్ధిక మంత్రి, శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల సంచలన వ్యాఖ్యలు చేసారు. "గత 8నెలల్లో వైసిపి పాలనలో రాష్ట్రంలో ప్రగతి గుండుసున్నా.. ఆదాయం పడిపోవడమే కాకుండా రెవిన్యూ వ్యయం పెరిగింది. మూలధన వ్యయం రూ.10,486కోట్లు తగ్గింది. ఉద్యోగుల జీతాలు,పెన్షన్లు ఇవ్వడమే కనాకష్టం అయ్యింది. సంక్షేమంపై వ్యయం రూ.2వేల కోట్లు తగ్గించేశారు. పేదల సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచారు. టిడిపి ప్రభుత్వ పథకాలను రద్దు చేశారు, కోతలు విధించారు. చేతగానితనంతో రాష్ట్రాన్ని ఆర్ధికసంక్షోభంలోకి నెట్టారు. మూలధన వ్యయంలో మూడింట 2వంతులు కోతలు. ఇలాగైతే భవిష్యత్తులో కూడా ఆదాయం పెరగదు. వచ్చే ఆదాయం అంతా జీతాలు, పెన్షన్లకే సరి..అభివృద్ది పనులకు, సంక్షేమానికి పైసా లేదు. రెవిన్యూ డెఫిసిట్, ఫిస్కల్ డెఫిసిట్ విపరీతంగా పెరిగాయి. ఆహార ద్రవ్యోల్బణం 5% పైగా పెరిగింది. తలసరి ఆదాయం రెండేళ్ల దిగువకు పడిపోయింది. ధరలు పెరిగాయి, కొనుగోలు శక్తి తగ్గింది, పొదుపుశక్తి పడిపోయింది.అటు రాష్ట్రాన్ని అధ:పాతాళంలోకి నెట్టారు. ఇటు పేదల నోటివద్ద ముద్ద నేలపాలు చేశారు. రివర్స్ టెండర్ల పేరుతో అభివృద్దిని రివర్స్ చేశారు, దానితో పేదల సంక్షేమం కూడా రివర్స్ అయ్యింది.
రాజకీయ సంక్షోభంలో వైసిపి చిక్కుకుంది. వైసిపి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. రాష్ట్రానికి, జాతికి సరిదిద్దలేని నష్టం చేశారు. ఒక్క ఛాన్స్ అడిగి తీసుకుని, అదీ ఎంతకాలం నిర్వాకం చేస్తారో తెలీని స్థితి..ఇన్ని సమస్యలున్నా సీఎం జగన్ చిద్విలాసంగా ఉన్నారు. పైశాచిక ఆనందంలో మునిగితేలుతున్నారు. ఒక్కఛాన్స్ వచ్చింది, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశానన్న పిచ్చి ఆనందమే ఆయనకు మిగిలింది. ఈ ఏడాది బడ్జెట్ అంచనాల్లో ద్రవ్యలోటు రూ.35,260కోట్లు ఉంటే, 8నెలల్లోనే రూ.35వేల కోట్ల అప్పులు చేశారు. రాబోయే 4నెలల్లో ఇంకెంత అప్పు చేస్తారో తెలీని దుస్థితి. ఈ ఏడాది అప్పుల అంచనా రూ.68వేల కోట్లు ఉంటే, వైసిపి నిర్వాకాలతో ఎక్కడా అప్పు పుట్టని పరిస్థితి. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చక్కదిద్దే సామర్ధ్యం వీళ్లకు లేదు. అందుకే రాష్ట్రాన్ని ఆందోళనల్లో ముంచారు. మొన్న ఇసుక కోసం ఆందోళనలు, నిన్న గిట్టుబాటు ధరల కోసం ఆందోళనలు, ఇప్పుడు రాజధాని కోసం ఆందోళనలు.. ఈ ఆందోళనలతో రాష్ట్రంలో పెట్టుబడుల వ్యతిరేక వాతావరణం..
రాజధానిపై అయోమయం సృష్టించారు. 3రాజధానులు అంటా గందరగోళం చేశారు. టిడిపి హయాంలో వచ్చిన పెట్టుబడులను తరిమేశారు. యువత ఉపాధి అవకాశాలను పోగొట్టారు. సంపద సృష్టి అవకాశాలన్నీ మూసుకుపోయాయి. అన్ని శాఖల్లో ఆర్ధిక అస్థిరత ఏర్పడింది. క్రెడిట్ అవకాశాలు నీరుగారిపోయాయి. కాబట్టి తక్షణం రాష్ట్రంలో ఆర్ధిక అత్యవసర పరిస్థితి విధించాలి. ఆర్టికల్ 360 కింద ఆర్ధిక అత్యవసర పరిస్థితి విధించాలి. వైసిపి నేతలు భూకబ్జాలు, ఇసుక దందాలు,మద్యం మాఫియాలో తలమునకలు.. రాష్ట్రాన్ని రక్షించడం వైసిపి నేతలకు ఎటూ చేతకాదు. అందుకే ప్రజలే రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ‘‘సేవ్ ఆంధ్రప్రదేశ్’’ నినాదం అన్నిచోట్ల ప్రతిధ్వనించాలి" అంటూ యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేసారు.