సహజంగా మనం రాజకీయ నాయకులు చేసే, నిరసనలు, ఆందోళనలు చూస్తూ ఉంటాం. వారు ఒక అరగంట హడావిడి చేసి, పోలీసులు అరెస్ట్ చెయ్యటంతో, ఆందోళన అక్కడితో అయిపోతుంది. రాజకీయ నాయకులు చేసే ఉద్యమాలు ఇలా ఉంటాయి. అయితే ఈ రోజు అమరావతి రైతులు రహదారి దిగ్బంధం పిలుపిచ్చారు. ఉదయం నుంచి పోలీసులు ఒక వ్యూహం ప్రకారం వ్యవహరించారు. విజయవాడ, గుంటూరులో ఉన్న తెలుగుదేశం నాయకులను బయటకు రాకుండా అరెస్ట్ చేసారు. ఎక్కడికక్కడ వారిని హౌస్ అరెస్ట్ చేసారు. వారిని బయటకు వచ్చే అవకాశమే ఇవ్వలేదు. తెలుగుదేశం నేతలతో పాటుగా, జనసేన, కమ్యూనిస్ట్ పార్టీ నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేసారు. అయితే రాజకీయ పార్టీ నేతలను అరెస్ట్ చేస్తే చాలు, ఉద్యమం ఏమి ఉండదు, రహదారి దిగ్బంధం ఉండదు అని పోలీసులు భావించారు. అయితే, ఇక్కడ జరుగుతుంది మాత్రం, ప్రజా ఉద్యమం. అమరావతి రైతులు, కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు, ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు.
రాజకీయ నాయకులని అరెస్ట్ చేస్తే చాలు అనుకున్న పోలీసుల వ్యూహం బెడిసికొట్టింది. 9 గంటలకు ప్రారంభం అయిన రహదారి దిగ్బంధం, చినకాకాని దగ్గర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దాదపుగా నాలుగు గంటలుగా కొనసాగుతూనే ఉంది. ఎంత మంది పోలీసులు వచ్చినా, వారిని కొట్టినా, అరెస్ట్ చేసినా, ఇంకా ఇంకా రైతులు వస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే, ఒక వేళ రాజకీయ నాయకులు వచ్చి ఉంటేనే, ఇది చప్ప బడిపోయేది. రాజకీయ ఉద్యమంగా చూసే వారు. ఇప్పుడు ప్రజలు స్వచ్చందంగా రావటం, ఆడవాళ్ళు, పిల్లలు వచ్చి రోడ్డు మీద కూర్చోవటంతో, నాలుగు గంటలుగా కొనసాగుతూనే ఉంది. నాయకులను అరెస్టు చేసి ఇంట్లో ఉంచితే ఉద్యమం ఆగదు అనే భ్రమ లో కనుక ప్రభుత్వం ఉంటే, అది కాదు ఇది ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన ఉద్యమం అని నిరూపించింది ఈ రోజు జాతీయ రహదారి దిగ్బంధం.
అయితే ఎమ్మెల్యే పిన్నెల్లి మీద జరిగిన ఘటన, కొంత ఉద్రిక్తతకు దారి తీసింది. అయితే దీని పై కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, అదే టైంలో ఒక అరగంట ముందు, మంత్రి ఆదిమూలం సురేష్ అటుగా వచ్చి ఇరుక్కు పోయారు. అయితే, అక్కడ ఉన్న రైతులు, ఆయనకు హెల్మెట్ ఇచ్చి, బైక్ పై పంపించారు. అలాంటి రైతులు, ఎమ్మెల్యే పిన్నెల్లి మీద ఎందుకు దాడి చేస్తారు అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఒక వేల ఇది ఏమన్నా ప్లాన్ ప్రకారం, రాజధాని వ్యతిరేకులు చేసారా అనే అనుమానం కూడా, అక్కడ వారు వ్యక్తం చేస్తున్నారు. వాహాన్ని అడ్డుకుంటం, నిరసన తెలపటం వరకు సరే కాని, కారు పగలు గొట్టింది ఎవరు ? అనే చర్చ స్థానికుల్లో జరుగుతుంది. ఏం జరుగుతోందంటూ అమరావతి జేఏసీ వర్గాల ఆరా తీస్తుంది.