ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మూడు రాజధానులు అంటూ, జగన్ చేసిన ప్రకటనకు, మద్దతు పలికుతూ కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ నేత చిరంజీవి ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ లేఖ ఫేక్ అంటూ, సోషల్ మీడియాలో కొంత మంది పోస్ట్ లు పెడుతున్నా, ఇంత వరకు చిరంజీవి నుంచి అధికారిక స్పందన రాలేదు. అయితే, ఇవన్నీ వార్తా చానల్స్ లో, వార్తా పేపర్లలో వచ్చినా, చిరంజీవి స్పందించలేదు అంటే, ఆ లేఖ నిజం అనే భావించాల్సి ఉంటుంది. ఆ లేఖలో జగన్ నిర్ణయం పై చిరంజీవి పొగడ్తల వర్షం కురిపించారు. గతంలో అభివృద్ధి అంతా హైదరాబాద్ లో ఉండటం వలనే సమస్య వచ్చిందని, ఇప్పుడు అంతా అమరావతిలో పెడుతున్నారని, అందుకే జగన్ తీసుకున్న నిర్ణయం అద్భుతం అంటూ పొగిడారు. అయితే మరో పక్క తమ్ముడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం, జగన్ మూడు రాజధానులను వ్యతిరేకించారు. ఇలా అన్నయ్య ఒక ప్రకటన, తమ్ముడు ఒక ప్రకటన చెయ్యటంతో, అభిమానుల్లో మాత్రం భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి.
అయితే ఇది ఇలా ఉంటే, చిరంజీవి తీసుకున్న నిర్ణయం పై, బీజేపీ ఘాటుగా స్పందించింది.చిరంజీవి లేఖ పై, బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు స్పందించారు. ఈ రోజు మధ్యాహ్నం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో రమేష్ మీడియాతో మాట్లాడుతూ, చిరంజీవి జగన్ భజన చేస్తున్నారని, ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు హక్కు కూడా లేదని, విశాఖలో ఆయనకు ఏదో లాభాపేక్ష ఉందని, దాని కోసమే చిరంజీవి, జగన్ భజన చేస్తున్నారని, ఆయన ఆరోపించారు. జగన్ తీసుకున్న మూడు కళ్ళ సిద్ధాంతం, ప్రజలను మభ్య పెట్టటానికే ఉందని, ఏ ప్రాంతం కూడా ఈ నిర్ణయంతో బాగుపడదని, అలాంటి నిర్ణయాన్ని, చిరంజీవి సమర్ధించటం చూస్తుంటే, దీని వెనుక ఉన్న భాగోతం అర్ధం అవుతుందని అన్నారు.
అలాగే చిరంజీవి నిర్ణయం పై, తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కూడా ట్విట్టర్ లో స్పందించారు. ఆయన డైరెక్ట్ గా పేరు చెప్పకుండా, పరోక్షంగా స్పందించారు. దీనికి సంబంధించి, ఆయన తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. "అప్పుడేమో ప్రజలకోసమని ప్రజారాజ్యం పెట్టే.దాన్ని మరో పార్టీలో కలిపే.మంత్రి పదవి పొంది విభజన పాపంలో భాగమయ్యే.ఇప్పుడు తమ్ముడు జనం కోసం పోరాడుతుంటే భుజం తట్టక మరో రాగమెత్తుకునే.ఐనా తెలంగాణలో వ్యాపారాలు, సినిమాలు చేసుకునే పెద్దన్నకు ఏపీ జనం కష్టాలు ఏం తెలుస్తాయిలే.మళ్లీ దూకేస్తాడేమో." అంటూ సోమిరెడ్డి ట్వీట్ చేసారు. మొత్తానికి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న చిరంజీవి, ఇప్పుడు ఈ విషయంలో ఎందుకు స్పందించారో, ఎవరికీ అర్ధం కావటం లేదు.