జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన, మూడు రాజధాని ప్రకటన పై, అమరావతి రైతులు ఆవేదనతో రగిలిపోతున్నారు. నిన్న పురుగుమందు డబ్బాలు పట్టుకుని, రోడ్డెక్కిన రైతులు, ఈ రోజు అమరావతి బంద్ కు పిలుపిచ్చారు. అమరావతి గ్రామాల్లో ఈ రోజు స్వచ్చందంగా బంద్ చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా భూములు ఇచ్చిన రైతులు, రైతు కూలీలు రోడ్డు ఎక్కి నిరసన తెలుపుతున్నారు. ఎక్కడికక్కడ స్వచ్చందంగా బంద్ చేస్తూ ఉండటంతో, రాజధాని గ్రామాల్లో, జనజీవనం స్తంభించింది. రోడ్డు పై బైటాయించి, ఆందోళన చేస్తున్నారు. మరి కొన్ని చోట్ల రోడ్డుకి అడ్డంగా వాహనాలు పెట్టి, ఆందోళన చేస్తున్నారు. మందడం, వెంకటపాలెం, తుళ్లూరు, రాయపూడి, తుళ్ళురు, వెలగపూడి, కృష్టాయపాలెం, మందడం తదితర ప్రాంతాల్లో రైతుల ఆందోళనకు, ట్రాఫిక్ ఆగిపోయింది. అలాగే, వెంకటపాలెంకు గ్రామానికి చెందిన రైతులు నిరాహారదీక్షకు దిగారు. ప్రతి రోజు ఇక్కడ రిలే నిరాహార దీక్షలు చేస్తామని ప్రకటించారు.
అయితే, ఈ ఆందోళనలు ఇలా ఉండగా, ప్రభుత్వం అమరావతిలో 144 సెక్టన్ అమలు చేస్తుంది. రాజధాని రైతుల బంద్, ఆందోళనలు నేపధ్యంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా, రాజధానిలోని 29 గ్రామాల్లో పోలీసులు ఎక్కువ ఫోర్సు పెంచారు. రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్ తో పాటుగా, 30 పోలీస్ యాక్ట్‌ను కూడా రాజధాని గ్రామాల్లో అమలు చేశారు. ప్రజలు నిరసన తెలిపితే, శాంతియుతంగానే తెలపాలని తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి అన్నారు. బంద్‌లో పాల్గొనాలని ఎవరినీ ఒత్తిడి చేయొద్దని, అలా చేసిన వారి పై, తీవ్రమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. రాజధాని పరిధిలోని ముగ్గురు అదనపు ఎస్పీలు, 10 మంది డీఎస్పీలు, 20 మంది సీఐలు, 30 మంది ఎస్సైలతో బందోబస్తు ఏర్పాటు చేసారు.
అమరావతి రాజధానిగానే ఉంచాలని, తమ పొట్ట కొట్టొద్దు అంటూ, రైతులు ఆందోళన చేస్తున్నారు. రాజధాని ఇక్కడే ఉంచాలని, 33 వేల ఎకరాలు ఇచ్చిన మాకు, అన్యాయం చెయ్యొద్దని అంటున్నారు. మరి కొంత మంది అయితే, మీరు రాజధాని ఎక్కడైనా పెట్టుకోండి, ఇంకా ఇక్కడ అసెంబ్లీ కూడా ఎందుకు, ఇది కూడా తీసి ఎక్కడో ఒక చోట పెట్టుకోండి, 2015లో మీకు భూములు ఎలా ఇచ్చామో, అలాగే ఇప్పుడు మా భూములు మాకు తిరిగి ఇచ్చేసి, మీరు ఎక్కడో ఒక చోట పెట్టుకోండి, ఇక్కడ అసలు లెజిస్లేటివ్ కాపిటల్ కూడా వద్దు అంటూ, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి, అసెంబ్లీలో జగన్ చేసిన ప్రకటన వెనక్కు తీసుకునే వరకు, ప్రతి రోజు ఆందోళను చేస్తూనే ఉంటామని, పిలుపిచ్చారు.