అమరావతిని నిర్వీర్యం చేస్తూ, మూడు రాజధానులు అంటూ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై, ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు సాగుతున్నాయి. 33 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా, అటు వైపు కూడా చూడని ప్రభుత్వం, అలాగే అక్కడ స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలు, రైతులు వైపు కూడా చూడలేదు. ఈ రోజు కూడా రైతులు కాళ్ళు చేతులు విరిగేలా, ఈ రోజు అసెంబ్లీ ముట్టడి కూడా చేసారు. అయితే, ఇదే విషయం పై ఈ రోజు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఈ బిల్లు పై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీ అమరావతిలోనే ఉంటుందని జగన్ మోహన్ రెడ్డి గారు ప్రకటించటం, మా అదృష్టమని, జగన్ గారు తీసుకున్న ఈ నిర్ణయం, అమరావతికి దక్కిన గౌరవమని అన్నారు. అంతే కాదు, విజయవాడ, గుంటూరు ప్రజలు అమెరికా కి వెళ్ళి డాలర్లు సంపాదించుకుంటున్నారు, ఇక్కడ సమస్య లేదు, మిగతా ప్రాంతాల వాళ్ళు కూడా ఇలాగే వలస వెళ్ళి డాలర్లు సంపాదించుకోవాలి, అందుకే పరిపాలన వికేంద్రీకరణ అంటూ చెప్పుకొచ్చారు.
గ్రామ సచివాలయాల ద్వారా ప్రభుత్వాన్నే ప్రజల ముందుంచాం. అలాంటప్పుడు సెక్రటేరియట్ ఎక్కడుంటే ఏమిటి? హైకోర్టు ఎక్కడుంటే ఏమిటి? నెల రోజుల నుంచి చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారు. ఎక్కడ ఇన్‌సైడర్ ట్రేడింగ్ బయటపడుతోందనని భయపడుతున్నారు. ఆయన బినామీలను కాపాడుకోవడానికే ఈ ధర్నాలు, నిరసనలు చేపడుతున్నారు. ప్రజలు రాకపోవడంతో బయట నుంచి తీసుకొచ్చి ఆందోళనలు చేయిస్తున్నారు’’ అని ఆళ్ల ఆరోపించారు. అయితే ఆళ్ళ ఇలా మాట్లాడటం పై అందరూ ఆశ్చర్య పోతున్నారు. ఒక పక్క ఇక్కడ 29 గ్రామాల ప్రజలు, రోడ్డున పడి రోదిస్తుంటే, ప్రజలకు సంబంధం లేకుండా, స్థానిక ఎమ్మెల్యే మాత్రం, అమరావతిలో అసెంబ్లీ మాత్రమే ఉండటాన్ని, ఇది ఈ ప్రాంత ప్రజలు అదృష్టం అని అంటున్నారు.
మరో పక్క, ఏపీ భవిష్యత్తును సర్వనాశనం చేసే ఈ బిల్లుపై మాట్లాడేందుకు చాలా బాధగా ఉందని రేపల్లె తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. గత నెల రోజులుగా లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నా.. ప్రభుత్వం మాత్రం ఒంటెద్దు పోకడలతో ముందుకెళ్తోందన్నారు. పాలన వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ‘‘అమరావతిలో 10వేల మందికి పైగా పోలీసులను మోహరించి ఈ బిల్లు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందా? ఉదయం 11 నుంచి 2గంటల వరకు ఆర్థికమంత్రి చాలా తెలివిగా ప్రజలను తప్పుదోవ పట్టేంచేలా సత్యదూరమైన మాటలు చెప్పారు. రాష్ట్రానికి రాజధాని లేదు.. కలల రాజధాని కావాలన్న తపనతో రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం అమరావతి రైతులు 33వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇచ్చారు. " అని అన్నారు.