విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మేల్యే జలీల్ ఖాన్, చాలా రోజుల తరువాత మీడియా ముందుకు వచ్చారు. పోయిన సారి ఎన్నికల్లో, తన కూతురుకు టికెట్ ఇప్పించారు జలీల్ ఖాన్. అయితే, ఆమె ఓడిపోవటంతో, కొన్నాళ్ళు ఆక్టివ్ గా లేరు. ఆయితే ఆయన పార్టీ మారిపోతున్నారు అంటూ, హడావిడి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వీటి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టిన జలీల్ ఖాన్, ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. జగన్ మోహన్ రెడ్డి పై, తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. అమరావతి విషయంలో, జగన్ మోహన్ రెడ్డి, బుద్ధి జ్ఞానం లేకుండా ప్రవరిస్తున్నారని మండిపడ్డారు. కళ్ళు ఉన్నవాడు, కడుపుకి అన్నం తింటున్న వాళ్ళు ఎవరైనా, ఇప్పటికే ఉన్న రాజధాని మారుస్తా అంటూ పరుష పదజాలంతో విరుచుకు పడ్డారు. ఎక్కడైనా పరిపాలన అంతా ఒకే దగ్గర నుంచి జరుగుతుందని, జగన్ కు ఆ మాత్రం తెలియదా అని ప్రశ్నించారు. ప్రజలను ఇబ్బంది పెట్టటానికి, ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా అని ప్రశ్నించారు. మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యటానికి వీలు లేదని అన్నారు.
అమరావతి కోసం, 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులను ఏమి చేద్దామని అనుకుంటున్నారని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి, తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారని, తన పతనానికి తానే నాంది పలికారని అన్నారు. అమరావతిలో రైతులు, ఎప్పుడు బయటకు రాని మహిళలు పోరాడుతున్నారని, వారికి అన్ని జిల్లాల రైతులు, మహిళలు అండగా నిలవాలని అన్నారు. విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వ భూములుతో పాటుగా, అక్కడ అధికంగా ఉన్న క్రిస్టియన్ సంస్థల భూముల పై జగన్ కన్ను పడిందని ఆరోపించారు. అమరావతి మీద రిఫరెండెంకు వెళ్ళాలని, మీ ఎమ్మేల్యేని ఇక్కడ రాజీనామా చెయ్యమనండి, నేను పోటీలో ఉంటా, ఎవరు గెలుస్తారో, ప్రజలు ఎవరి వైపు ఉంటారో, అమరావతి వైపు ఉంటారో లేదో తెలుస్తుందని చాలెంజ్ చేసారు.
ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ, ఇప్పుడు ప్రజల నెత్తిన టోపీ పెడుతున్నారని అన్నారు. హై పవర్ కమిటీ అంటే మేధావులు, నిపుణులు ఉంటారు అనుకుంటే, గొర్రెల మందలా మీ మనుషులే ఉన్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. బోస్టన్ కమిటీ ఒక బోగస్ కమిటీ అని, వారికి అసలు కనీస అవగాహన కూడా మన రాష్ట్రం పై లేదని అన్నారు. మహిళలు, రైతులని ఏడిపిస్తే, దేవుడు చూస్తూ ఊరుకోడని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి అంటే ఉద్యోగులు భయపడుతున్నారని, అందుకే వారికి విశాఖ వెళ్ళటం ఇబ్బంది అయినా, ఏమి మాట్లాడటం లేదని అన్నారు. ఇంత తిట్లు తిట్టిన జలీల్ ఖాన్, అమరావతిని ఇక్కడ నుంచి మార్చవద్దని, అమరావతి మార్చకుండా ఉంటే జగన్ కి పాదాభివందనం చేస్తా, నెత్తిన నీరు చల్లు కుంటా నంటూ జలీల్ ఖాన్ వ్యాఖ్యానించారు.