ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అమరావతి రగడ పై, తెలంగాణా ప్రభుత్వ పెద్దలు, తమకు ఈ పరిణామాలు మంచి చేస్తున్నాయి అని ఎంజాయ్ చేస్తున్నారు కాని, ఎక్కడా బహిరంగంగా స్పందించలేదు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించలేదు. ఇక కేటీఆర్ అయితే, అది ఒక రాష్ట్ర అంతర్గత వ్యవహారం అని, దాని పై ఆ రాష్ట్ర ప్రజలే స్పందిస్తారని చెప్పారు. మరో మంత్రి హరీష్ మాత్రం, ఏపిలో జరుగుతున్న పరిణామాలు, మాకు రియల్ ఎస్టేట్ బాగుంది అని చెప్పారు కాని, ఎక్కడా ప్రభుత్వ నిర్ణయం పై స్పందించలేదు. ఇక తెలంగాణా ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ కూడా, తెలంగాణా పౌరుడిగా సంతోషిస్తున్నా అని చెప్పి, ఆ రాష్ట్ర వ్యవహారం మాకు ఎందుకు అని వదిలేసారు. ఇక చివరకు కేంద్రంలో ఉండే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా, అధికారికంగా ప్రకటన రాకుండా, మేము స్పందించం అని చెప్పారు. అయితే ఇంత మంది, పక్క రాష్ట్రం వాళ్ళు, అమరావతిలో జరుగుతున్న విషయాల పై, తమ అభిప్రాయం చెప్పటానికి ముందుకు రాలేదు. అది ఒక రాష్ట్ర అంతర్గత వ్యవహారం, అని వదిలేసారు.
అయితే, ఇదే తెలంగాణాకు చెందిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రం, ఇక్కడ జరుగుతున్న ఉద్యమం పై సుదీర్ఘంగా మాట్లాడారు. ఎప్పటి లాగే, ఈ అవకాశాన్ని కూడా, తనకు రాజకీయ బిక్ష పెట్టిన, చంద్రబాబు పై విమర్శించటానికే ఉపయోగించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సంక్రాంతి సంబరాలు, కోడి పందాలు ఆడుకోవటానికి, ఏలూరు ప్రాంతానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన, అమరావతిలో జరుగుతున్న పోరాటం పై స్పందిస్తూ, అమరావతి రైతులకు భారోసా ఇచ్చారు. ఇక్కడ మంత్రులు నోరు ఎత్తటం లేదు కాని, పక్క రాష్ట్ర మంత్రి వచ్చి, భరోసా ఇవ్వటం ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. అమరావతి రైతులు ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని, జగన్ మోహన్ రెడ్డి అన్నీ చూసుకుంటారని అన్నారు.
ఇంకా చెప్పాలంటే అమరావతిలో రైతులు అందరూ సంతోషంగా ఉన్నారని, బిక్షమెత్తుకునేవాళ్లే ఇబ్బంది పడి, రోడ్డున పడ్డారని సంచలన వ్యాఖ్యలు చేసారు. మీకు ఒక డైనమిక్ ముఖ్యమంత్రి ఉన్నారనీ, ఆయన మీకు అంతా మంచే చేస్తాడని అన్నారు. అలాగే చంద్రబాబు పై ఘాటైన విమర్శలు చేసారు. చంద్రబాబు జోలె పట్టుకుని ఉద్యమం కోసం తిరుగుతూ ఉండటాన్ని విమర్శిస్తూ, ఈ బిక్షాటన చేసేవాళ్లతో ఏం జరగదనీ, మునిగిపోతారని అన్నారు. అయితే తెలంగాణా ఉద్యమం చేసిన పార్టీలో ఉంటూ, ఉద్యమాన్ని, ఉద్యమం చేసే వారిని బిచ్చగాళ్ళగా తలసాని అంటున్నారు అంటే, ఈయన అసలు తెలంగాణా ఉద్యమం జరుగుతున్న సమయంలో ఎక్కడ ఉన్నారు, ఈయనకు ఉద్యమం అంటే ఏంటో తెలిస్తే కాదా, అనే విమర్శలు వస్తున్నాయి. పక్క రాష్ట్రంలో లక్షల మంది ఉద్యమం చేస్తుంటే, అలా చెయ్యద్దు, మీకు భరోసా అంటూ ఈయన చెప్పటం ఏమిటో అంటూ విమర్శలు వస్తున్నాయి.