మూడు రాజధానుల విషయంలో బీజేపీ వైఖరి స్పష్టంగానే ఉందని ఉత్తరప్రదేశ్ మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణతో కలిసి బుధవారం విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అమరావతి రాజధానిని తరలించొద్దంటూ ఇప్పటికే తమ పార్టీ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అమరావతి రాజధాని శంకుస్థాపన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగిందని చెపుతూ రాష్ట్ర రాజధానుల నిర్మాణాలకు కేంద్రం నిధులు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. అమరావతి నిర్మాణం కోసం మాత్రం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందనే విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 75 జిల్లాలు ఉన్నప్పటికీ ఒకే రాజధాని ఉందన్నారు. అతిపెద్ద రాష్ట్రమైనయూపీలో రాజధాని లక్నో నుంచి సమర్థవంతమైన పాలన అందిస్తున్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. యూపీకి అధికారులను పంపితే తమ పాలన తీరును వివరిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో లఖ్‌నవూకు 1,600 కిమీ దూరంలో ఉండే ప్రాంతానికి కూడా ప్రభుత్వ సంకేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు అందిస్తున్నామని చెప్పారు. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల అవసరం ఉండబోదన్నారు. ఏపీకి చెందిన మత్స్యకారులను పాకిస్తాన్ చెరనుంచి సురక్షితంగా తీసుకురావడంలో కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ బీజేపీ తరుపున కన్నా లక్ష్మీనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. మిగిలిన మత్స్యకారులను సైతం తొందరలోనే విడిపిస్తారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైసీపీ పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు ఇచ్చినట్లు సిద్ధార్థనాథ్ సింగ్ తెలిపారు. కాంగ్రెస్, వామపక్ష పార్టీలు దీనిపై అనవసర రాద్ధాంతం చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నాయన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫనిస్తాన్ దేశాల్లో దాడులకు గురై శరణార్థులుగా వచ్చే హిందూ, బౌద్ధ, సిక్కు, పార్శీ, క్రైస్తవులకు పౌరసత్వం ఇచ్చేందుకు ఉద్దేశించినదే తప్ప ఎవరి పౌరసత్వాన్ని హరించదన్నారు.
శరణార్థులుగా వచ్చిన వారు పౌరసత్వం లేక పిల్లలను పాఠశాలలకు కూడా పంపించలేని స్థితిలో ఉన్నారన్నారు. దశాబ్దాలుగా ఇక్కడికి శరణార్థులుగా వచ్చి మారూమూల గ్రామాల్లో నివశిస్తున్న వారి జీవితాల్లో ఈ బిల్లు వెలుగులు నింపుతందన్నారు. పార్లమెంటులో చట్ట సవరణను ఆమోదించిన విపక్షాలు రాజకీయ లబ్ది కోసం ముస్లిం మైనారిటీలను రెచ్చగొడుతున్నారన్నారు. వీరికి పౌరసత్వం విషయంలో గతంలోనే పలు ఒప్పందాలు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో లబ్ది పొందుతున్న వారిలో ముస్లింలు, దళితులే ఎక్కువగా ఉన్నట్లు ఆయన తెలిపారు. నరేంద్రమోడీ ప్రభుత్వం త్రిపుల్ తలాక్, రామమందిర్, ఆర్టికల్ 370 వంటి అనేక దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపిన వి సాయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.