ప్రతి ఇంటి ముందు ఇద్దరు పోలీసులు. వారి చేతిలో వలలు, దోమ తెరలు. ఇలా ఎందుకో తెలుసా ? జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్ అటుగా వెళ్తుందని, ఇళ్ళలో నుంచి ఎవరైనా రాళ్ళు వేస్తారేమో, ఎవరైనా దాడి చేస్తారేమో అని భయపడి, పోలీస్ వారి చేత చేసిన ఏర్పాటు ఇది. ప్రజల మధ్య నుంచి నవ్వుత, ఠీవిగా వెళ్ళాల్సిన ప్రభుత్వ అధినేత, ఇలా 144 సెక్షన్ పెట్టుకుని, ఒక్క మనిషి కూడా బయట లేకుండా, డమ్మీ కాన్వాయ్ పంపించి, ప్రతి ఇంటి ముందు ఇద్దరు పోలీసులని పెట్టి, వారి చేతిలో వలలు పెట్టుకుని వెళ్ళాల్సిన పరిస్థితి. ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రంలో పరిస్థతి ఎలా ఉందొ అర్ధం అవుతుంది. ఏడు నెలలు క్రితం, ఇదే ప్రదేశంలో, వైసీపీ పార్టీకి అఖండ మెజారిటీ ఇచ్చి, అక్కడ ప్రజలు గెలిపించారు. ఎక్కడైతే పువ్వులు పరిచి నడిపించారో, ఇప్పుడు అదే చోట, ఎవరు ఎటు వైపు నుంచి దాడి చేస్తారో, అని భయపడుతూ, వెళ్ళ వలసిన పరిస్థితి. 151 మంది ఎమ్మేల్యేలు నా వెంట ఉన్నారు, నాకు భారీ మెజారిటీ ఇచ్చారు అని చెప్పుకునే చోట, 144 లేకుండా బయటకు రాని పరిస్థితి వచ్చింది.
మూడు రాజధానుల ప్రకటనతో, అమరావతిలో రైతులు నిరసన బాట పట్టారు. గత 22 రోజులుగా ఆందోళన చేస్తూనే ఉన్నారు. అయినా ఒక్కరంటే ఒక్కరు కూడా, ప్రభుత్వం తరపు నుంచి వచ్చి వీరితో మాట్లడలేదు. మీ సమస్య ఏమిటి, ఏమి చెయ్యాలి, మీ డిమాండ్ ఏమిటి అని కూడా అడగలేదు. ఒక్క మంత్రి కానీ, అధికారి కాని, చివరకు స్థానికి వైసీపీ ఎమ్మెల్యే కాని, అటు వైపు కూడా చూడటం లేదు. దీంతో ప్రజలు, వైసీపీ పై ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపధ్యంలోనే ప్రతి రోజు రైతులు రోడ్డు పైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఈ సందర్భంలో, నిన్న జగన్ మోహన్ రెడ్డి, తాడేపల్లిలో తన ఇంటి నుంచి, వెలగపూడి సెక్రటేరియట్ కు వెళ్ళాలని నిర్ణయం తీసుకోవటం, ఆయన కాన్వాయ్, అమరావతి గ్రామాల మీదుగా వెళ్ళాల్సి ఉండటంతో, పోలీసులు అలెర్ట్ అయ్యారు.
నిన్న ఉదయం నుంచి, ఎవరినీ రోడ్ల పైకి రానివ్వలేదు. దుకాణాలు అన్నీ మూయించారు. జగన్ తిరిగి ఇంటికి వెళ్ళేంత వరకు, ఎవరూ రోడ్డు మీదకు రాకూడదు అని, షాపులు కూడా తెరవకూడదు అని, పోలీసులు చెప్పారు. చివరకు మందులు షాపులు కూడా తెరవనివ్వలేదని గ్రామస్తులు వాపోయారు. బయటకు వచ్చి భోజనం చెయ్యాలి అన్నా, జగన్ వెళ్ళేదాకా కుదరదని చెప్పారని , గ్రామస్తులు వాపోయారు. ప్రతి గ్రామంలో, మూడంచెల బందోబస్తును నిర్వహించారు. లింకురోడ్డులో ఇనుప కంచె, బారికేడ్లు ఏర్పాటుచేసి గ్రామస్థులు ఎవరినీ ఆ రోడ్డులోకి కూడా రానివ్వ లేదు. చివరకు, ఇళ్ళ ముందు కూడా పోలీసులు వలలు పట్టుకుని నుంచునే పరిస్థితి. ఇవన్నీ చూస్తుంటే, ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం, ఇప్పుడు ఇలా అయ్యింది ఏమిటో అని బాధ పడటం తప్ప, మనం చెయ్యటానికి ఏమి లేదు.