వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు నిన్న ఢిల్లీలో ఇచ్చిన విందు హాట్ టాపిక్ అయ్యింది. వైసీపీ ఎంపీ హోదాలో కాకుండా, సబార్డినేట్ లెజిస్లేచర్ కమిటీ అధ్యక్షుడి హోదాలో ఆయన నిన్న ఢిల్లీలో ఎంపీలకు విందు ఇచ్చారు. జనపథ్, లాన్స్ ఆఫ్ వెస్టర్న్ కోర్టులోని కాంగ్రెస్ ఎంపీ, తన వియ్యకుండు అయిన కేవీపీ ఇంట్లో ఈ విందు ఇచ్చారు. ఈ విందుకు 300 పైగా ఎంపీలు హాజరు అయ్యారు. అయితే ఈ విందుకు కొంత మంది వైసీపీ ఎంపీలు హాజరు అయినా, ఢిల్లీలోనే ఉన్న విజయసాయి రెడ్డి మాత్రం హాజరు కాకపోవటం గమనార్హం. ఈ విందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి సహా మరి కొంత మంది హాజరు అయ్యారు. అయితే ఈ విందుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు హాజరు కావటం గమనార్హం. విందుకు హాజరైన ఎంపీలనురఘురామ కృష్ణంరాజు ఆత్మీయంగా ఆహ్వానించారు. తెలుగు వంటలు రుచి చూపించి, గోదావరి జిల్లాల ఆతిధ్యం రుచి చూపించారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా గతంలో చాలా మంది ఎంపీలు ఇలా పార్టీ ఇచ్చేవారని, ఈ శీతాకాల సమావేశాల ముగింపు సందర్భంగా తాను పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకున్నానని, అందుకే సబార్డినేట్ కమిటీ చైర్మన్‌గా ఎన్నిక కావడం తో ఈ విందు ఇచ్చానని చెప్పుకొచ్చారు. అయితే ఢిల్లీలో ఎంపీలు, కేంద్ర మంత్రులకు ఇచ్చిన విందు పై తాను ఎవరికీ వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ముందు ఎంపీని అని, తాను ఎన్నో పార్టీలకు హాజరవుతుంటానని, దానికి ఎవరి పర్మిషనూ తీసుకుని వెళ్లలేదని, ఇప్పుడు నేను ఇచ్చిన పార్టీ గురించి ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చెయ్యటం హాట్ టాపిక్ గా మారింది.
పెద్ద ఆపేద్ద నేతలతో సఖ్యత పెంచుకోవాలంటే వారిని సీక్రెట్‌గా పిలిపించి పార్టీ ఇచ్చే వాడిని అని, ఇలా అందరికీ తెలిసేలా ఎందుకు చేస్తానని ప్రశ్నించారు. అంతే కాదు, తనకు, జగన్ కు మధ్య గ్యాప్ పెంచే విషయంలో, తమ పార్టీకి చెందిన ఒకరిద్దరు ఎంపీలు ప్రయత్నిస్తున్నారని, దాని గురించి తనకు పూర్తీ సమాచారం ఉంది అంటూ మరో బాంబు పేల్చారు. తన పై, తమ పార్టీ అధినేతకు ఉన్నవీ లేనివీ కల్పించి, వాళ్ళు చెబుతున్నారని ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలు విజయసాయి రెడ్డిని ఉద్దేశించి చేసినవా అనే అనుమానాలు కలుగుతున్నాయి. రఘురామ కృష్ణంరాజుకి, విజయసాయి రెడ్డికి చాలా గ్యాప్ పెరిగింది అని, అందుకే ఒకరి పై ఒకరి ఆధిపత్యం చూపించుకుంటున్నారు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.