ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అయితే, ఈ సమావేశాలు కవర్ చెయ్యటానికి, వివిధ మీడియా ఛానెల్స్ కు పాసులు ఇచ్చారు. అయితే, మూడు ఛానెల్స్ కు మాత్రం, పాసులు ఇవ్వలేదు. స్పీకర్ ఆదేశాలు ప్రకారం, ఆ మూడు ఛానెల్స్ కు, అసెంబ్లీలోకి ఎంట్రీ లేదని, అందుకే పాసులు ఇవ్వటం లేదని చెప్పారు. దీంతో ఆ మూడు ఛానెల్స్ ప్రతినిధులను అసెంబ్లీ ఆవరణలోకి ఎంటర్ అవ్వనివ్వలేదు. గత అసెంబ్లీ సెషన్ లో, జరిగిన దానికి, అప్పుడే మూడు ఛానెల్స్ అయిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, టీవీలను, అసెంబ్లీలోకి ఎంట్రీ లేకుండా ఆంక్షలు విధించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో, 45 ఏళ్ళకే పెన్షన్ హామీ పై తెలుగుదేశం పార్టీ, జగన్ ప్రభుత్వాన్ని నిలదీసింది. దీంతో తట్టుకోలేని ప్రభుత్వం వారిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చెయ్యటం, మార్షల్స్ వచ్చి వారిని ఎత్తి బయట పడేయటం జరిగాయి.
ఈ సందర్భంగా, సస్పెండ్ అయిన తెలుగుదేశం శాసనసభ్యులు, మీడియాతో మాట్లాడుతూ తమ గోడు చెప్పుకున్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఇది జరిగింది. అయితే ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉండగా, మీడియా పాయింట్ వద్ద టిడిపి నేతలు మాట్లాడిన మాటలు ఎలా ప్రసారం చేస్తారు అంటూ, అసెంబ్లీ స్పీకర్, వీరి పై ఆంక్షలు విధించారు. అప్పటి నుంచి వీరికి అసెంబ్లీలోకి ఎంట్రీ లేదు. అయితే ఐ అండ్ పీఆర్ నుంచి ఫీడ్ తీసుకుని, అసెంబ్లీ సమావేశాలు ప్రసారం చేసినా, అది కూడా వద్దు అంటూ, స్పీకర్ కార్యాలయం వారించింది. అయితే తాము కేవలం ఒక్క నిమిషం మాత్రమే ఇచ్చామని, ఇలా మరోసారి జరగకుండా చూసుకుంటామని, వారు స్పీకర్ కు అప్పుడే చెప్పారు.
తరువాత కొన్ని సార్లు వెళ్లి, తమ పై విధించిన నిషేధం ఎత్తేయాలని కోరారు. అయితే, ఈ రోజు నుంచి జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో, మరోసారి వారిని లోపలకి రానివ్వలేదు. దీంతో వారు ఖంగుతిన్నారు. సహజంగా ఆ అసెంబ్లీ సెషన్ కు నిషేధం విధిస్తారని, ఇప్పుడు తమను జీవిత కాలం నిషేదిస్తారా అంటూ వారు ఆశ్చర్య పోతున్నారు. స్పీకర్ ను అనేకసార్లు కోరామని, తాము ఇన్ని రోజులు నిషేధం విధించే తప్పు ఏమి చేసామంటూ వాపోతున్నారు. వారికి అసెంబ్లీలోకి పర్మిషన్ లేకపోవటం, అలాగే ఐ అండ్ పీఆర్ ఫీడ్ కూడా ప్రసారం చెయ్యవద్దు అని చెప్పటంతో, ఈ మూడు ఛానెల్స్ లో, ఎక్కడా అసెంబ్లీ సమావేశాలు రావటం లేదు. తెలుగుదేశం పార్టీ కూడా ఈ చర్యను, మరోసారి సమీక్షించాలని కోరుతుంది.